గేమ్ ఛేంజర్ ట్రైలర్…. అందరి చూపు దీని వైపే!

2025 మొదటి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈ రోజు సాయంత్రం ఏఎంబిలో రాజమౌళి అతిథిగా జరగనుంది. టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ దీని కోసమే ఎదురు చూస్తున్నారు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా, శంకర్ దర్శకత్వం, తమన్ సంగీతం లాంటి ఆకర్షణలు ఎన్ని ఉన్నా ఉండాల్సిన స్థాయిలో హైప్ లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్న తరుణంలో దాన్ని తగ్గించే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. పైగా దిల్ రాజు అన్నట్టు ఒక చిత్రం రేంజ్ డిసైడ్ చేయబోయేది ఖచ్చితంగా ట్రైలరే.

జనవరి 10 కి ఇంకో ఎనిమిది రోజులే ఉండటంతో ఈ పబ్లిసిటీ చాలా కీలకం. కౌంట్ డౌన్ పోస్టర్లు నిన్నటి నుంచి మొదలుపెట్టారు. 9 డేస్ టు గో లుక్ లో శంకర్ వింటేజ్ మార్క్ కనిపించింది. పండగకు ముందే రావడం వల్ల ఓపెనింగ్స్ భారీగా తెచ్చుకునే అవకాశం గేమ్ ఛేంజర్ ఒక్కదానికే ఉంది. పైగా టికెట్ రేట్ల హైక్, స్పెషల్ షోలు ఏపీలో అయినా ఉంటాయి కాబట్టి నెంబర్లు కీలకమవుతాయి. దేవర, పుష్ప 2లకు ధీటుగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సో రెండున్నర నిమిషాల ట్రైలర్ దానికి తొలి పునాది వేయాల్సి ఉంటుంది. చూసినవాళ్ల టాక్ ప్రకారం అంచనాలు మారిపోతాయని అంటున్నారు.

సో సాయంత్రం ఎప్పుడవుతుందాని మూవీ లవర్స్ ఎదురుచూపులు మొదలుపెట్టారు. రామ్ నందన్, అప్పన్నగా రెండు షేడ్స్ లో చరణ్ విశ్వరూపం ఎలా ఉండబోతోందనే దాని మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొంది. ఇటీవలే ఒక ట్విట్టర్ స్పేస్ లో తమన్ ఇచ్చిన ఎలివేషన్లు, అంతకు ముందు ఎడిటర్ చెప్పిన కబుర్లు అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి. కియారా అద్వానీ, ఎస్జె సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కాలేజీ స్టూడెంట్, రైతు, ఎన్నికల అధికారిగా మొత్తం మూడు గెటప్స్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడు.