విజయవాడలో జరిగిన అతి పెద్ద రామ్ చరణ్ కటవుట్ వేడుకకు అతిథిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ముందే అభిమానులకు మంచి జోష్ ఇచ్చే కబుర్లు పంచుకున్నారు. విడుదలకు కేవలం పదమూడు రోజులే ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ అంతకంతా పెరుగుతూ పోతోంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఈవెంట్ కన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వచ్చానని, అమెరికాలో అంత గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకున్నాక ఇక్కడ డిప్యూటీ సిఎం ఆధ్వర్యంలో జరిగితే ఇంకెంత బాగుంటుందని ఊరించడంతో ఒక్కసారిగా ప్రాంగణంలో చప్పట్లు మారుమ్రోగిపోయాయి.
ట్రైలర్ గురించి అప్డేట్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం తన ఫోన్ లో ఉందని, కాకపోతే మీకోసం సిద్ధం చేయడానికి కొంచెం టైం పట్టిందని, నూతన సంవత్సర కానుకగా జనవరి 1ను చూసేయండని హామీ ఇచ్చారు. ఇవాళ చిరంజీవి మధ్యాన్నం మరోసారి సినిమా చూసి ఫోన్ చేసి మాట్లాడుతూ ఫ్యాన్స్ తో ఈ సంక్రాంతికి గట్టిగా కోడుతున్నామని చెప్పమనడంతో ఈలలు హోరెత్తాయి. మెగాస్టార్ ప్రస్తావన వచ్చినప్పుడు నలభై సంవత్సరాలుగా ఎదిగిన ఆయన కృషికి ఫలితమే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులతో ఒక మహా వృక్షాన్ని పరిశ్రమకు అందించారని పొగడ్తల వర్షం కురిపించారు.
ఒక్కడే బాస్ అంటూ చిరంజీవి గురించి దిల్ రాజు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా పేలలేదు. మొత్తానికి కటవుట్ ఆవిష్కరణే అయినా భారీగా జరిగిన ఈ సంబరానికి వేలాదిగా ఫ్యాన్స్ తరలివచ్చారు. ప్రమోషన్ల పరంగా ఉన్న కాసింత అసంతృప్తి క్రమంగా తగ్గుముఖం పట్టేలా హైప్ పెరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు అసలు భారం ట్రైలర్ మీద ఉంది. ఒక సినిమా రేంజ్ డిసైడ్ చేసేది ట్రైలరేనని అందుకే దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని దిల్ రాజు చెప్పడం చూస్తే కంటెంట్ సాలిడ్ గా ఉన్న విషయం అర్థమైపోయింది. రాబోయే వారం పది రోజులు గేమ్ ఛేంజర్ హడావిడి మాములుగా ఉండదు.