సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే ఛాలెంజ్ గా మారుతోంది. అలాంటిది ఒకే సమయంలో టయర్ 1 నుంచి టయర్ 3 దాకా అరడజను ప్రాజెక్టులను లైన్ లో పెట్టడమంటే మాటలు కాదు. అందులోనూ కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే హారిక హాసిని, సితారల గురించి చెప్పనక్కర్లేదు. 2025 నుంచి రాబోయే రెండు సంవత్సరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్న లైనప్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మైత్రి మూవీ మేకర్స్ తో పోటీ పడుతూ నువ్వా నేనా తరహాలో వరసగా బాక్సాఫీస్ ని పలకరించబోతున్నారు.

ముందుగా వచ్చేది బాలకృష్ణ ‘డాకు మహారాజ్’. ఇప్పటికే దీని మీదున్న అంచనాలు తెలిసిందే. బాబీ డైరెక్షన్ గురించి నిర్మాత నాగవంశీ మాములుగా ఊరించడం లేదు. కొత్త క్యాస్టింగ్ తో గౌతమ్ తిన్ననూరి చేసిన ‘మేజిక్’ చివరి దశలో ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం స్పెషల్ గా నిలుస్తుందట. ఇదే దర్శకుడితో తీస్తున్న ‘విజయ్ దేవరకొండ 12’ మీదున్న హైప్ గురించి చెప్పనక్కర్లేదు. క్రేజీ ఎంటర్ టైనర్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ని వేసవిలోగా తీసుకురాబోతున్నారు. నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రోజు’ నిన్నే ఫ్రెష్ గా అనౌన్స్ చేశారు. రవితేజ ‘మాస్ జాతర’ ప్రస్తుతానికి మే 9 థియేటర్ రిలీజ్ లాక్ చేసుకుంది.

సినిమాట్రోగ్రాఫర్ రవి కె చంద్రన్ దర్శకత్వంలో ‘తమర’ ప్రకటించి మూడేళ్లు దాటింది. త్వరలో కార్యరూపం దాల్చవచ్చని సమాచారం. ఇవి కాకుండా అల్లు అర్జున్ – త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్, విశ్వక్ సేన్ – అనుదీప్, ఆనంద్ దేవరకొండ – ఆదిత్య హాసన్, సూర్య – వెంకీ అట్లూరి, మోక్షజ్ఞ – వెంకీ అట్లూరి, సిద్దు జొన్నలగడ్డ కోహినూర్, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సూపర్ హీరో మూవీ, అల్లరి నరేష్ – సిద్దు జొన్నలగడ్డ – అశోక్ గల్లాలతో విడివిడిగా మూడు సినిమాలు. వీటిలో చాలా మటుకు లాకైపోగా మరికొన్ని ఫైనల్ కావాల్సి ఉంది. ఇంత బిజీగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండటం టాలీవుడ్ కు శుభ సంకేతమే.