హీరోలు సాధార‌ణ మ‌నుషులే.. మ‌రిచిపోతున్నారు: త‌మ్మారెడ్డి

ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఆయ‌న ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడ‌తారు.. ఏం చేసినా ఆలోచించి అడుగులు వేస్తారు. ఈ క్ర‌మంలోనే తాజాగా త‌మ్మా రెడ్డి పుష్ప‌-2 వివాదంపై స్పందించారు. నిజానికి ఈ ఘ‌ట‌న ఈ నెల 4న జ‌రిగింది. ఆ త‌ర్వాత‌.. అనేక మ‌లుపులు కూడా తిరిగింది. కానీ, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భ‌ర‌ద్వాజ ఇప్పుడు అనూహ్య వ్యాఖ్య‌లు చేశా రు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

హీరోలు కూడా సాధార‌ణ పౌరులేన‌ని.. వీరు కూడా కామ‌న్‌గా ఉండే అన్ని అంశాల‌కు అతీతులు కార‌ని వ్యాఖ్యానించారు. కానీ, ఈ విష‌యాన్ని కొంద‌రు మ‌రిచిపోతున్నార‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో కు ఎలాంటి హ‌డావుడీ లేకుండా వెళ్లి ఉంటే.. స్టాంపేడ్ జ‌రిగేది కాద‌న్నారు. ప్రీమియ‌ర్ షోల‌కు వెళ్ల‌డం.. అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం హీరోల‌కు కొత్త‌కాద‌ని.. కానీ, చేసిన ప్ర‌చారమే తాజా ప‌రిస్థితిని సీరియ‌స్ చేసింద‌న్నారు.

“హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి” అని త‌మ్మారెడ్డి అన్నారు. అస‌లు ఎందుకింత హంగామా ? అని ప్ర‌శ్నించారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని.. కానీ.. ఏదో హంగామా చేయ‌డం ద్వారానే ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ట్టు చెప్పారు. గ‌తంలోనూ చిరు, బాల‌య్య‌లు తొలి షో చూసేందుకు వెళ్లినా.. హంగామా చేసేవారు కాద‌న్నారు.

ధ‌ర‌లు పెంచి ..

హీరోల రెమ్యూన‌రేష‌న్ భారం అంతా ప్రేక్ష‌కుల‌పైనే ప‌డుతోంద‌ని త‌మ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత అడిగితే అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చే సంస్కృతి పెరిగింద‌న్నారు. అందుకే.. స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఈ భారం భ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు. అస‌లు క‌లెక్ష‌న్ల ప‌రంగా.. సొమ్ముల ప‌రంగా ఒక సినిమాకు పేరు రావ‌డం కాద‌ని.. న‌ట‌న ప‌రంగా.. తెలుగు సినిమాకు పేరు రావాల్సి ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.