వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు ఆ తర్వాత ఎక్కువ పేరు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాలే. ముఖ్యంగా బద్రి అప్పట్లో ఏ రేంజ్ లో అదరగొట్టిందో చెప్పడం కష్టం. కొంత రకం గొంతుతో అతను చేసిన ప్రయోగాలు యూత్ ని ఊపేశాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం కోసం భీమ్స్ ఏరికోరి రమణని తీసుకురావడం ఎంత పెద్ద ప్లస్ అయ్యిందంటే మూవీకి బజ్ రావడంలో గోదారి గట్టు మీద సాంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో రమణ గోగుల పలు విషయాలు పంచుకున్నారు.
తమ్ముడు కంపోజింగ్ టైంలో పవన్ కళ్యాణ్ బెంగళూరులో ఉన్న రమణ గోగుల ఇంట్లో ఉన్నారు. నిరాశలో ఉన్న హీరో ఏదో సాధించాలనే స్ఫూర్తి పొందేలా అవసరమైన చివరి పాట కోసం కసరత్తు జరుగుతోంది కానీ ఎంతకీ తేలడం లేదు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కీ బోర్డు ప్లే చేసుకుంటూ సోఫాలో ఉన్న రమణ గోగుల హఠాత్తుగా లుక్ అట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్ అంటూ రెండు ఇంగ్లీష్ లైన్లు పాడారు. ఠక్కున పట్టేసిన పవన్ దీన్నే పాటగా మార్చమని చెప్పడం, పూర్తి లిరిక్స్ ని అప్పటికప్పుడు పూర్తి చేసి మొత్తం హాలీవుడ్ స్టైల్ లో సిద్ధం చేయడం జరిగిపోయాయి. అదెంత ఛార్ట్ బస్టర్ అయ్యిందో చూశాం.
అన్నవరం తర్వాత పవన్ రమణ గోగుల మళ్ళీ కలుసుకునే సందర్భం రాలేదు. తిరిగి ఓజి కోసం ఒక పాట పాడించేందుకు తమన్ ప్రయత్నిస్తున్నట్టు టాక్. అదే జరిగితే క్రేజీ సాంగ్ అఫ్ ది ఇయర్ గా మారడం ఖాయం. దశాబ్దంన్నరకు పైగా సంగీత దర్శకత్వానికి దూరంగా ఉన్న రమణ గోగుల తిరిగి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారంటే మాత్రం త్వరలో అంటున్నారు తప్పించి ఫలానా టైం అని చెప్పడం లేదు. చూస్తుంటే గాయకుడిగా బిజీగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గోదారి గట్టు విన్న తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఆఫర్లు ఇస్తామని ఫోన్ చేస్తున్నారట. రమణ మాత్రం తొందరపడటం లేదు.
.
Gulte Telugu Telugu Political and Movie News Updates