పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం.. అతను ఒక రోజు జైలులో ఉండి విడుదల కావడంతో ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది పరామర్శకు వెళ్లారు. శనివారం ఉదయం నుంచి బన్నీ ఇల్లు సెలబ్రెటీలతో కళకళలాడిపోయింది. పొద్దుపోయే వరకు పరామర్శలు కొనసాగాయి.
బన్నీని విక్టరీ వెంకటేష్ సహా ఎంతోమంది స్టార్లు, సన్నిహితులు, బంధువులు కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అన్నింట్లోకి ఒక వీడియో మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. బన్నీ మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ.. బన్నీని కలిసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. మేనల్లుడిని ఆమె ఆప్యాయంగా హత్తుకోవడం.. బన్నీ భావోద్వేగానికి గురవుతూ ఆమె చేతికి ముద్దుపెట్టడం అందరికీ చూడముచ్చటగా అనిపించింది.
ఇటీవల మెగా ఫ్యామిలీకి, అల్లు కుటుంబానికి కొంచెం దూరం పెరిగినట్లు భావిస్తున్న నేపథ్యంలో బన్నీని సురేఖ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సురేఖను అక్కడున్న ఓ పెద్ద మనిషి.. బాగా కంగారు పడ్డట్లున్నారే అని అడగ్గా, అందుకామె బదులిస్తూ అంతే కదండీ. పిల్లలకు ఇలా జరిగితే టెన్షన్ పడతాం కదా. నిన్న ఆయన కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు అని వ్యాఖ్యానించింది. ఆయన అంటే ఇక్కడ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బన్నీ అరెస్టవగానే చిరంజీవి.. తన ఇంటికి వచ్చేశారు. అంతే కాక తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన లాయర్ నిరంజన్ రెడ్డిని పురమాయించి.. ఈ కేసు టేకప్ చేసేలా చూశారు. నిరంజన్ రెడ్డి కోర్టులో సమర్థంగా వాదించి బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చేలా చూశారు. మొత్తానికి బన్నీ అరెస్ట్ ఉదంతంతో.. ఇప్పటిదాకా మెగా, అల్లు కుటుంబాల మధ్య నెలకొన్న చిన్న గ్యాప్ పూడుకున్నట్లే కనిపిస్తోంది.అంతా మన మంచికే అనే మాట ఇలాంటి సందర్భాల్లోనే నిజం అనిపిస్తుంది ఎవరికైనా.