‘పుష్ప-2’ విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా..ఈ రోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
“చట్టం తనపని తాను చేసుకుపోతుందని” రేవంత్ చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో తన జోక్యం ఏమీ ఉండదని ఆయన అన్నారు. చట్టం ముందు అంతా సమానమే అని రేవంత్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అల్లు అర్జున్ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. ఆయనను నాంపల్లి కోర్టుకు భారీ భద్రత మధ్య పోలీసులు తరలిస్తున్నారు.
మరోవైపు, అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ను కేటీఆర్ ఖండించారు పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట ఈ అరెస్ట్ అని కేటీఆర్ విమర్శించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాడని, అయినప్పటికీ అతడిని సాధారణ నేరస్థుడిగా ట్రీట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని అన్నారు. ఇక, హైడ్రా కూల్చివేతల వల్ల రేవంత్ రెడ్డి కూడా ఇద్దరి చావుకు బాధ్యుడని, అదే లాజిక్‌తో ఆయనను అరెస్ట్ ఎందుకు చేయరని కేటీఆర్ ప్రశ్నించారు.