షాకింగ్ : ప్రసాద్ మల్టిప్లెక్స్ కి రావట్లేదా పుష్పా…

గత పది పదిహేనేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ కొత్తగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు చూస్తున్నాం. ఐతే తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా మల్టీప్లెక్స్ వినోదాన్ని పరిచయం చేసిన ఘనత ప్రసాద్స్‌కే దక్కుతుంది. హైదరాబాద్‌కు పర్యాటకులు వస్తే కచ్చితంగా సందర్శించాల్సిన మాన్యుమెంట్ లాగా మారింది ప్రసాద్స్. నగరంలో పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు వచ్చినా.. ప్రసాద్స్ ప్రత్యేకత ప్రసాద్స్‌దే. కొత్త సినిమాకు ఫస్ట్ షో అక్కడే పడాలి.

ఫిలిం సెలబ్రెటీలు, మీడియాతో పాటు రెగ్యులర్ ఫిలిం గోయర్స్ అంతా అక్కడే సినిమా చూడాలి. అలాంటి కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది ప్రసాద్స్. అలాంటి స్పెషల్ మల్టీప్లెక్సులో ‘పుష్ప-2’ లాంటి భారీ సినిమా ప్రదర్శనకు నోచుకోని పరిస్థితి తలెత్తడం హైదరాబాద్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ‘పుష్ప-2’ నిర్మాతలకు, ప్రసాద్స్ యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం వల్ల.. బుధవారం 9 గంటల ప్రాంతంలో కూడా ప్రసాద్స్‌లో ‘పుష్ప-2’ ఒక్క షోకు కూడా బుకింగ్ మొదలు కాలేదు.

గురువారం నుంచి ఏ రోజుకూ అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ‘పుష్ప-2’ కోసమని అన్ని స్క్రీన్లనూ అట్టి పెట్టుకుని ఉన్నారు కానీ.. ఈ వివాదం ఎంతకీ తేలకపోవడంతో బుకింగ్సే ఓపెన్ కాలేదు. మామూలుగా అయితే ముందు రోజు 9.30కి షెడ్యూల్ చేసిన పెయిడ్ ప్రిమియర్స్ ప్రసాద్స్‌లో కచ్చితంగా పడేవి. కానీ ఈ వివాదం వల్ల ప్రసాద్స్ బోసిపోయి ఉంది. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. జనాలతో కళకళలాడాల్సిన ప్రసాద్స్ ప్రాంగణం ఖాళీగా కనిపిస్తుండడం సినీ ప్రియులకు ఎంతమాత్రం రుచించేది కాదు.