బిగ్ డే – పుష్ప 2 మాస్ జాతర మొదలు!

టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్డులు ఎదురు చూస్తున్న బిగ్ డే వచ్చేసింది. మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండి అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లకు వచ్చేసింది. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం ద్వారా అతి పెద్ద రిస్కు తీసుకున్న మైత్రి దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకోవడం ఖాయమని ఎర్లీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే సాధారణ ప్రేక్షకులు చూసేది ఇవాళ్టి నుంచి కాబట్టి అసలు ఛాలెంజ్ ఇకపై మొదలవుతుంది. పుష్పరాజ్ వీరంగం ఏ స్థాయిలో ఉంటుందోనని బాలీవుడ్ వర్గాలు సైతం ఎదురు చూస్తున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు చెబుతున్న ట్రేడ్ టాక్ చూస్తే మతులు పోవడం ఖాయం. రాజమౌళి బ్రాండ్ లేకుండా, విఎఫెక్స్ ఎక్కువ డిమాండ్ చేసే ఫాంటసీ సబ్జెక్టు కాకుండా ఇంత హైప్ ఏర్పడటం చూస్తే పుష్ప బ్రాండ్ దేశమంతా ఏ స్థాయిలో పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలను అంతగా పట్టించుకోని బీహార్ లాంటి రాష్ట్రంలో సైతం ముందస్తు షోలతోనే కోటి దాటించడం పుష్ప ర్యాంపేజ్ కి నిదర్శనం. ప్రధాన నగరాలు తిరిగి బన్నీ చేసుకున్న ప్రమోషన్లు మాములు రీచ్ తేలేదు. పాట్నా నుంచి హైదరాబాద్ దాకా అన్ని ఈవెంట్లు బ్లాక్ బస్టరే. అమాంతం హైప్ పెంచేశాయి.

అడ్డంకులు కూడా పుష్ప 2కి గట్టిగా పలకరించాయి. తమిళనాడులో తుఫాను ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసింది. కర్ణాటకలో తెల్లవారుఝాము షోలు హఠాత్తుగా రద్దు చేయడం శరాఘాతం అయ్యింది. సోషల్ మీడియాలో ఒక వర్గం కావాలని నెగటివ్ క్యాంపైన్ చేస్తోందని బన్నీ ఫ్యాన్స్ ఆరోపించారు. ఇలా చుట్టూ అనుకోని చిక్కులు చుట్టుకోవడం పుష్ప 2ని ఇబ్బందుల్లో నెట్టినా ఆడియన్స్ లో ఏర్పడ్డ అంచనాలు మొదటి రోజు ఎలాగైనా చూడాలన్న సంకల్పాన్ని కలిగించాయి. రాత్రి వచ్చిన టాక్ గట్టిగా నిలబడితే మాత్రం రోజుల తరబడి పుష్ప రికార్డుల గురించి మాట్లాడుకోవడానికే సమయం సరిపోదేమో.