రకూల్ కి జిమ్ లో ఇంత ప్రమాదం తప్పిందా…

జిమ్‌కు అంద‌రూ ఆరోగ్యం కోస‌మే వెళ్తారు. కానీ అక్క‌డ మ‌రీ హ‌ద్దులు దాటి బ‌రువులు ఎత్తినా.. చేయ‌కూడ‌ని విన్యాసాలు చేసినా ప్రాణాల మీదికి వస్తుంది. ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా పేరున్న వాళ్లు కూడా జిమ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవ‌డం, ప్రాణాల మీదికి తెచ్చుకోవ‌డం చూస్తూనే ఉంటాం. ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌కే ప‌రిమితం అయిన ర‌కుల్ ప్రీత్ ఫిట్‌నెస్ మీద ఎంత శ్ర‌ద్ధ పెడుతుందో తెలిసిందే. ఆమెకు సొంతంగా ఫిట్‌నెస్ ఛైన్ కూడా ఉంది. అలాంటి అమ్మాయి తాజాగా జిమ్‌లో ప‌రిమితికి మించి బ‌రువులు ఎత్తి పెద్ద ప్ర‌మాదాన్ని ఎదుర్కొంద‌ట‌. ర‌కుల్ లేటెస్ట్‌గా ఆసుప‌త్రిలో చేర‌డం అభిమానుల‌ను కంగారు పెట్టింది. అస‌లు ఏం జ‌రిగిందో ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. త‌న ఇబ్బందికి జిమ్‌లో అధిక బ‌రువులు ఎత్త‌డ‌మే కార‌ణ‌మ‌ని ర‌కుల్ వెల్లడించింది.

అది అక్టోబర్ 5, ఆ రోజు నేను మరిచిపోలేని రోజు. ఎప్పట్లానే జిమ్ కు వెళ్లాను. 80 కిలోలు లిఫ్టింగ్ చేశాను. దాంతో సడెన్ గా నా వెన్నెముకలో నొప్పి వచ్చింది. కానీ, ఆ నొప్పిని నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు. నాకు ఆ నొప్పి ఉన్నా.. నేను నేరుగా షూటింగ్ కు వెళ్లాను. రాత్రి ఇంటికొచ్చేసరికి వంగలేకపోయాను. ఓ దశలో నా దుస్తులు కూడా నేను మార్చుకోలేకపోయాను. ఆ తర్వాత నాలుగు రోజులకు సడన్ గా నా నడుము నుంచి కింది భాగం మొత్తం మొద్దుబారిపోతుంది. ఒక్కసారిగా నా బీపీ కూడా పడిపోయింది. అంతే ఆ దెబ్బతో స్పృహ తప్పిపోయాను.

ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది అని ర‌కుల్ వెల్ల‌డించింది. నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా జిమ్‌లో అధిక బ‌రువులు ఎత్తినా, విన్యాసాలు చేసినా ఎంత ప్ర‌మాద‌మో చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌. ర‌కుల్ ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు చేయ‌ట్లేదు. తెలుగు చిత్రాల‌కు అయితే దాదాపుగా పూర్త‌యిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నాని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వారి నిర్మాణ సంస్థ ప్ర‌స్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.