అల్లరోడిలో ఇంత మాస్ యాంగిల్ ఉందా…

ఒకప్పుడు కామెడీ సినిమాల కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో వెనుకబడినట్టు అనిపించినా కావాలనే గ్యాప్ తీసుకుని చేసిన మహర్షి సపోర్టింగ్ రోల్ అయినా సరే మంచి పేరు తీసుకొచ్చింది. సీరియస్ ఇష్యూ మీద చేసిన నాంది ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటివి ఆశించిన ఫలితాలివ్వలేదు. అయితే వీటిలో ఎక్కడా అల్లరి నరేష్ మాస్ టచ్ పాత్రలను ప్రయత్నించలేదు. ఆ లోటుని తీర్చేందుకా అన్నట్టు బచ్చల మల్లి రాబోతోంది. ఇవాళ వదిలిన టీజర్ సాంపిల్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

జులాయిగా పెరిగిన మల్లి అనే కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడతాడు. ఎన్ని దుర్గుణాలున్నా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మల్లి తాను ఇష్టపడిన అమ్మాయితోనూ అదే రకంగా ఉండటమే సమస్యను తీసుకొస్తుంది. తండ్రి గొప్పవాడిగా చూడాలంటె ఇతను మాత్రం ఊరంతా తిట్టుకునే పోరంబోకు అవుతాడు. అయితే కల్లాకపటం తెలియని ఈ మొరటోడుకి ఊరంతా శత్రువులే. ఎందుకలా జరిగింది, ఇంట్లోనే కానివాడిగా ఎందుకు మారాడు అనేది తెరమీద చూడాలి. స్టోరీ పరంగా చెప్పుకుంటే ఎప్పుడూ చూడని విననిది కాదు కానీ అల్లరి నరేష్ ని ఇలా కమర్షియల్ గా చూపించడం కొత్తగా ఉంది.

ఒకరకంగా పుష్ప తరహాలో క్యారెక్టరైజేషన్ అనిపించినా ట్రీట్ మెంట్ లో చూపించే వ్యత్యాసం బచ్చల మల్లిని ప్రత్యేకంగా నిలపాలి. హనుమాన్ ఫేమ్ అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చడం విశేషం. క్యాస్టింగ్ గట్రా పెద్దదే ఉంది. క్రిస్మస్ పండక్కు డిసెంబర్ 20న విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ కాబోతున్న బచ్చల మల్లి ఖచ్చితంగా తనకు కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లరి నరేష్. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు. లాంఛ్ ఈవెంట్ కి ఏకంగా ట్రాక్టర్ నడుపుకుంటూ రావడం కన్నా క్రేజీ ఐడియా ఏముంటుంది.

Bachhala Malli - Official Teaser | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevvi | Razesh Danda