టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడంపై ఒక వర్గం నుంచి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరణ్ మాత్రం రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం వచ్చాను అని చాలా గౌరవంగా అక్కడి మతాలను గౌరవించారు. ఇక ఈ విషయంలో చాలామంది చరణ్ మత సామరస్యానికి పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.
అయితే ఓ వర్గం నుంచి వస్తున్న భిన్నమైన కామెంట్స్ కు చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎక్స్‌లో రామ్ చరణ్ దర్గా సందర్శన ఫొటోను షేర్ చేసిన ఉపాసన, భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. “విశ్వాసం మనలను కలిపే పద్ధతులలో ఒకటి. భారతీయులుగా మతానికి సంబంధించిన ప్రతి విధానాన్ని గౌరవించాలి. ఐక్యతలోనే అసలైన బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత విశ్వాసాలను గౌరవిస్తూనే ఇతర మతాల పట్ల కూడా ఆదరణ చూపుతారు” అని ఉపాసన రాసుకొచ్చారు.
ఒక మరో నెటిజన్ ఉపాసన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఇతర మతాలను గౌరవించడమంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదంటూ” వ్యాఖ్యానించాడు. దీనికి ఉపాసన తెలివైన సమాధానంగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. శబరిమలకు వెళ్లే భక్తులు మసీదులో ప్రార్థనలు చేసే సంప్రదాయం గురించి ఆ కథనంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఉపాసన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. “విశ్వాసాల మధ్య చీలికలను కాదని, సమగ్రతను ప్రోత్సహించాలన్నది ఉపాసన సందేశం,” అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ దర్గా సందర్శన అంశం వివిధ కోణాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇతర మతాలను గౌరవించడం, భారతీయ సమాజంలో మత సామరస్యానికి రామ్ చరణ్ తీసుకున్న ఈ అడుగు కొత్త స్ఫూర్తిగా నిలుస్తుందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates