గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్ 5 పుష్ప 2 వచ్చేదాకా ఫీడింగ్ కు ఇవే కీలకం కాబట్టి వీటిలో కొన్ని విజయం సాధిస్తే దీపావళి టైంలో హాళ్లు కళకళలాడినట్టు మళ్ళీ ఆ తరహా వాతావరణం చూడొచ్చని ఆశిస్తున్నారు. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ‘మెకానిక్ రాకీ’ గురించి. విశ్వక్ సేన్ ఎప్పటిలాగే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు కానీ ట్రైలర్ గట్రా చూస్తుంటే రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం మీద నమ్మకం పెట్టుకోవచ్చనేలాగే ఉంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ గ్లామర్లతో పాటు యాక్షన్ కంటెంట్ దట్టించారు.
రెండోది ‘దేవకీనందన వాసుదేవ’ క్రమంగా బజ్ పెంచే పనిలో పడింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథగా ఆయన బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో అశోక్ గల్లా హీరోగా పెద్ద బడ్జెట్ తోనే రూపొందింది. ఫాంటసీ టచ్ జనాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని టీమ్ ఆశిస్తోంది. టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ కోసం పోరాడుతున్న సత్యదేవ్ ఈసారి ‘జీబ్రా’గా వస్తున్నాడు. కంటెంట్ డిఫరెంట్ గా అనిపిస్తోంది. డాలీ ధనుంజయ్, సత్యదేవ్, సునీల్ లాంటి ప్రామిసింగ్ క్యాస్ట్ తో పాటు విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది.
రెండుమూడు సార్లు వాయిదా పడిన ‘రోటి కపడా రొమాన్స్’ని చాలా నమ్మకంగా తీసుకొస్తున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. యూత్ ఫుల్ స్టోరీతో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ సైలెంట్ కిల్లర్ అవుతుందని దర్శకుడు విక్రమ్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. ఇవి కాఉండా రాకింగ్ రాకేష్ ‘కెసిఆర్ కేశవ చంద్ర రమావత్’ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. సన్నీ లియోన్ టైటిల్ రోల్ పోషించిన ‘మందిర’ సైతం ఈ వారమే థియేటర్లలో అడుగుపెడుతోంది. కౌంట్ పరంగా అరడజను సినిమాలు కనిపిస్తున్నాయి ఏవి నిలబడి విజేతలుగా నిలుస్తాయో చూడాలి. భీకరమైన ఓపెనింగ్స్ కాదు కానీ టాక్ మీద ఆధారపడి హిట్టు కొట్టాల్సినవే అన్నీ.