‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు తన లుక్‌ను ఊర మాస్‌గా తయారు చేశాడు సుకుమార్. నలుపు రంగులో, గుబురు గడ్డం, బాగా పెరిగి చెదిరిపోయినట్లుండే జుట్టు.. కొంచెం గూని ఉన్న వాడిలా బన్నీని డీ గ్లామరస్‌గా మార్చాడు. ముందు బన్నీ లుక్స్ చూసి హీరోను ఇంత డీగ్లామరస్‌గా చూపిస్తే మన ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ క్యారెక్టర్లో ఉన్న బలం, ప్రత్యేకత ప్రేక్షకులకు నచ్చి లుక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆ లుక్‌తోనే అనేక మేనరిజమ్స్ వైరల్ అయ్యాయి.
బన్నీ హేర్ స్టైల్, తన నడక.. తన స్టెప్స్.. తగ్గేదేలే అనే మేనరిజమ్ ఎంతగా సోషల్ మీడియాను ఊపేశాయో తెలిసిందే. వేర్వేరు క్రీడలకు చెందిన ప్రముఖులు సైతం బన్నీ మేనరిజమ్స్‌ను అనుకరించారు.తాాజాగా ‘పుష్ప’ ప్రభావం హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ మీద కూడా పడింది. అతను ఈ మధ్య జులపాల జుట్టుతో చాలా స్టైల్‌గా కనిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతను వరుసగా రెండు మెరుపు శతకాలతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు.
ఈ సందర్భంగా సెంచరీ సెలబ్రేషన్స్ టైంలో తన జులపాల జుట్టు మీద అందరి దృష్టీ పడింది. చివరి టీ20 అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. తిలక్‌తో జరిపిన సరదా చిట్ చాట్‌లో తన జుట్టు గురించి అడిగాడు. అప్పుడు ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ను చూసే తాను ఇలా జుట్టు పెంచానని.. ఎక్కువ జుట్టు పెంచి హెల్మెట్ పెట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉందని చెప్పాడు తిలక్. ‘పుష్ప-3’లో నువ్వు కీలక పాత్ర పోషిస్తున్నావట కదా అని సూర్యకుమార్ జోక్ చేయగా.. మనకు క్రికెట్ ఆడడం తప్ప వేరే వ్యాపకం లేదని.. సినిమాల జోలికి వెళ్లనని చెప్పేశాడు తిలక్.