అంతా అనుకున్న ప్రకారం జరిగితే మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీం నుంచి అదిరిపోయే ట్రీట్ అంది ఉండాల్సింది. అందుకోసం పక్కాగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కరోనా వచ్చి అన్నింటినీ చెడగొట్టేసింది. ఆ రోజు కనీసం ఒక ఫస్ట్ లుక్ కానుక కూడా లేక తీవ్ర నిరాశకు గురయ్యారు తారక్ అభిమానులు.
పరిస్థితులు మామూలయ్యాక టీజర్ కంటెంట్ కోసం తారక్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి సాధ్యమైనంత త్వరగా అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు రాజమౌళి. ఈ ఎదురుచూపులతోనే నెలలు నెలలు గడిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పునఃప్రారంభం ఇదిగో అదిగో అన్నారు కానీ.. ఎంతకీ ఆ రోజు రాలేదు.
ఐతే ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ టీం చిత్రీకరణకు సిద్ధమైనట్లు సమాచారం. . ముందుగా మూణ్నాలుగు రోజులు ట్రయల్ షూట్ చేసి.. ఆ తర్వాత తారక్ మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారట. రామ్ చరణ్ ఈ నెలంతా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు హాజరు కాడు. ఆచార్య కోసం అతను కొన్ని కాల్ షీట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తారక్ మీద వరుసబెట్టి సన్నివేశాలు చిత్రీకరించి ముందుగా టీజర్ వదిలేసి.. ఆ తర్వాత మిగతా పని చూస్తారట. ఇంతకుముందు రామరాజు టీజర్‌కు తారక్ వాయిస్ ఇచ్చినట్లే దీనికి చరణ్ తన గాత్రాన్ని అందిస్తారని సమాచారం.