దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి. ఐతే అన్నింట్లోకి బాక్సాఫీస్ దగ్గర ఆల్ రౌండ్ దూకుడు చూపిస్తున్న సినిమా అంటే ‘క’ అనే చెప్పాలి.
‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ చిత్రాలు మల్టీప్లెక్సుల్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. కంటెంట్ పరంగా ‘క’తో పోలిస్తే అవి బెటర్ మూవీస్. రివ్యూలు కూడా వాటికే బెటర్‌గా వచ్చాయి. కానీ ‘క’ మూవీ క్లాస్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ‘క’ చూపిస్తున్న దూకుడూ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
శుక్రవారం సాయంత్రం, నైట్ షోలకు ఈ చిత్రం చిన్న సెంటర్లలో కూడా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. కలెక్షన్ల పరంగా దీపావళి చిత్రాల రన్ ముగిసేసరికి ‘క’ మూవీనే నంబర్ వన్ స్థానంలో ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. ఈ సినిమా ఈ స్థాయిలో నిలబడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే ‘క’ చాలా మంచి సినిమా. కానీ దీపావళి చిత్రాల్లో ఇది బెస్ట్ మాత్రం కాదు. ఐతే ఈసారి కిరణ్ కంటెంట్ ఉన్న సినిమాతో రావడమే కాక.. దీన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాడు.
దీనికి తోడు తన మీద జనాల్లో సింపతీ క్రియేట్ కావడం సినిమాకు బాగా ప్లస్ అయిందనడంలో సందేహం లేదు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఏ హీరోకైనా ఓ హిట్ పడితే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. పైగా కిరణ్ ఎప్పుడూ అణకువగానే కనిపిస్తాడు. హార్ట్ ఫుల్‌గా మాట్లాడతాడు.
గత చిత్రాల విషయంలో జరిగిన తప్పుల గురించి అతను నిజాయితీగా అంగీకరించాడు. అంతే కాక ‘క’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తనను ట్రోల్ చేసే వాళ్ల గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, తన తల్లి పడ్డ కష్టం గురించి మాట్లాడి జనాల్లో తన పట్ల సానుకూల భావన, సానుభూతి పెరిగేలా చేసుకున్నాడు.
అతను ఉద్దేశపూర్వకంగా ఇది చేసి ఉండకపోవచ్చు. కానీ తన మీద జనాల్లో సానుభూతి అయితే క్రియేట్ అయింది. కంటెంట్‌కు తోడు సింపతీ కూడా వర్కవుట్ కావడంతో ‘క’కు మంచి వసూళ్లు వస్తున్నాయి.