బాహుబలి తర్వాత ఒక కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడి పెరిగింది. కొందరు కథను రెండు భాగాలుగా తీస్తే ఇంకొందరు ఒక కథను ముగించి దానికి సీక్వెల్ చేస్తున్నారు. గ ఏడాది కాలంలో వచ్చిన భారీ చిత్రాలు సలార్, కల్కి, దేవర.. అన్నీ కూడా సెకండ్ పార్ట్‌తో రాబోయేవే. వీటిలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే.. కల్కి-2నే.
జులై నెలాఖర్లో విడుదలైన ‘కల్కి’ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో భాగం మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి.
ఫస్ట్ పార్ట్ విషయంలో ఉన్న అసంతృప్తి రెండో భాగంలో ఉండదని.. ఇంకా భారీ స్థాయిలో సినిమా ఉంటుందని.. ప్రభాస్ పాత్ర ఇంకా బలంగా ఉండి తన చుట్టూనే కథ తిరుగుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ గురించి మాట్లాడాడు.
తమిళ అనువాద చిత్రం ‘అమరన్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగికి యాంకర్ సుమ నుంచి ‘కల్కి-2’కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
ఆ సినిమా అప్‌డేట్ ఇవ్వమని అడిగితే.. కల్కి-2కు పార్ట్-1తో పోలిస్తే ఇంకా భారీగా ఉంటుందని అతను చెప్పాడు. కల్కి-2 ఒక్క సినిమా.. రెండు మూడు చిత్రాలకు సమానమని అంత భారీగా ఉంటుందని నాగి తెలిపాడు. ఐతే కల్కి-2 రావడానికి చాలా టైం మాత్రం పడుతుందని.. ఇప్పట్లో ఆ సినిమా ఉండదని నాగి చెప్పాడు.
ప్రస్తుతం స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్లు నాగి చెప్పాడు. తన వరకు అయితే తర్వాతి చిత్రం ‘కల్కి-2’నే అని.. వేరే సినిమాలేవీ పెట్టుకోలేదని నాగి చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ‘కల్కి-2’ను మొదలుపెట్టాలంట ఇంకో ఏడాదికి పైగానే సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.