అర్థం లేని ఆవేశమిది అయ్యంగర్ సార్

ఒక సినిమా బాగుండటం బాగోకపోవడం పూర్తిగా దాన్ని తీసిన దర్శక నిర్మాత రచయితల బృందం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆడియన్స్ మీదనో మీడియా మీదనో కాదు. ప్రపంచ చరిత్రలో ఏ చిత్రాన్ని వ్యక్తిగత ఎజెండాతో చంపేసిన వాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు.

ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే పొట్టెల్ సక్సెస్ మీట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూ రైటర్ల గురించి వాడిన భాష అంత అభ్యంతరకర స్థాయిలో ఉంది కాబట్టి. ల్యాగ్ ఉందన్నారని, కథనం మెల్లగా నడిచిందని రాశారని అయ్యవారికి కోపం వచ్చింది. అందుకే ఇక్కడ రాయలేని, ప్రస్తావించలేని తిట్లతో ఊరికే ఆవేశపడిపోయారు.

బలగం మొదటి రోజు మొదటి రెండు ఆటలకు పెద్దగా జనం లేరు. తర్వాత ఏమైంది. దిల్ రాజు సైతం ఊహించలేనంత పెద్ద బ్లాక్ బస్టరయ్యింది. రైటర్ పద్మభూషణ్ నిర్మాతలు సేఫ్ అవ్వడానికి కారణం హీరో సుహాస్ ఇమేజ్ కాదు. కంటెంట్ లోని బలం. విజయ్ దేవరకొండకి గుర్తింపు తెచ్చిన పెళ్లి చూపులు ఓపెనింగ్ డే కలెక్షన్ ఎంత.

టాక్ పెరిగాక ఫైనల్ గా క్లోజ్ అయిన ఫిగర్ ఎంత. చెక్ చేసుకుంటే జనంలో వచ్చిన అభిప్రాయాలు దానికెంత దోహదపడ్డాయో అర్థమవుతుంది. ఇప్పుడే కాదు శంకరాభరణం, మాతృదేవోభవ లాంటి క్లాసిక్స్ సైతం చాలా నెమ్మదిగా పికప్ అయ్యి చరిత్ర సృష్టించినవి. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

సో పొట్టేల్ కు సైతం ఇదే వరిస్తుంది. ఏ సమస్యా లేక, చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని పొగిడితే క్రమంగా వసూళ్లు పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో తమ సినిమాకు వచ్చినంత పాజిటివ్ రివ్యూలు దేనికీ రాలేదని దర్శకుడు సాహిత్ మోత్కూరి చెప్పిన కొన్ని నిమిషాలకే శ్రీకాంత్ అయ్యంగార్ దానికి పూర్తి రివర్స్ లో మాట్లాడ్డం సినిమాను మించిన ట్విస్ట్.

ముక్కుసూటిగా మాట్లాడ్డం అంటే సభ్యత మరిచి మాటలతో ఎదురుదాడి చేయడం కాదనేది ఎవరైనా ఒప్పుకునే మాట. దాన్ని మర్చిపోయి ఇలా స్టేజి మీద విరుచుకుపడితే వైరల్ వీడియో రూపంలో పబ్లిసిటీ దక్కుతుందనుకున్నారో ఏమో. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.