కొత్త సినిమాల ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు వస్తున్న ఫిలిం సెలబ్రెటీలను కొందరు జర్నలిస్టులు వేస్తున్న అభ్యంతరకర ప్రశ్నల మీద ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో ఒక జర్నలిస్టు పనిగట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. ఆయనకు హరీష్ శంకర్ లాంటి దర్శకులు గట్టిగా తలంటుపోశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ జర్నలిస్ట్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఐతే తాజాగా ఓ మహిళా జర్నలిస్ట్ యువ కథానాయిక అనన్య నాగళ్ళను ‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా అడిగిన ప్రశ్న తీవ్ర వివాదాస్పదమైంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చాకే అవకాశాలు ఇస్తారని నొక్కి వక్కాణిస్తూ.. మిమ్మల్ని కమిట్మెంట్ అడగలేదా అంటూ అనన్యను అడగడం మీద దుమారం రేగింది. ఈ ప్రశ్నకు అనన్య హుందాగా బదులిచ్చింది. తనకు అలాంటి అనుభవాలు లేవని.. ఇండస్ట్రీ గురించి అంత తప్పుగా మాట్లాడొద్దని ఆమె అంది.
అనన్యకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇండస్ట్రీలో కూడా ఆమె గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పొట్టేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగాన్ని ముగించబోతూ.. తమకు గౌరవం దక్కాలని కోరుకుంటున్నామంటూ పరోక్షంగా తాను ఎదుర్కొన్న ప్రశ్న మీద స్పందించింది అనన్య.
ఇక లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం మీద ఆమె మరోసారి మాట్లాడింది. “ఇంత డైరెక్ట్‌గా వేదిక మీద ఓ నటిని సున్నితమైన అంశం మీద ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనిపించింది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది నా కల. ఐదేళ్ల నుంచి దీని కోసం ఇంట్లో నేను పోరాడుతున్నా. ఇండస్ట్రీలోకి వెళ్లి కుటుంబం పరువు తీసిందని కొందరు ఆలోచిస్తారు. కానీ ‘పొట్టేల్’ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారనుకుంటున్నా. నా నటన గురించి మా అమ్మ అందరికీ చెప్పుకుని సంతోషిస్తుందని అనుకున్నా. కానీ ఈ ప్రశ్న వేసి ఆ ఆనందం లేకుండా చేశారు” అంటూ అనన్య ఆవేదన వ్యక్తం చేసింది.