బన్నీ ఫొటో ఆ బుక్.. సోషల్ మీడియా చర్చ

అల్లు అర్జున్‌ను తాజాగా ఓ నార్త్ ఇండియన్ అభిమాని కలవడం చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుంచి సైకిల్ మీద 1500 కిలోమీటర్లు ప్రయాణించి.. అతను హైదరాబాద్ చేరుకున్నాడు. తనను కలవడానికి అంత దూరం నుంచి సైకిల్ మీద రావడంతో అల్లు అర్జున్ కదిలిపోయాడు. ఆ అభిమానిని ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అభిమానిని తిరిగి విమానంలో స్వస్థలానికి పంపించడానికి బన్నీ ఏర్పాట్లు చేయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ అభిమానితో బన్నీ కనిపించిన ఫొటోలు, వీడియోల్లో నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని గమనించారు. బన్నీ వెనుక ఆయన తాత అల్లు రామలింగయ్య ఫొటోతో పాటు నందమూరి తారక రామారావు మీద రాసిన పుస్తకం ఉంది. దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఈ ఫొటోలో ఆ పుస్తకం కనిపించేలా ఉద్దేశపూర్వకంగానే పెట్టారేమో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బన్నీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు మెగా ఫ్యామిలీలో అందరూ జనసేనకు మద్దతుగా నిలిస్తే.. బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయడం దుమారం రేపింది.

దీని మీద మెగా అభిమానులు, జనసైనికులు మండిపడ్డారు. టీడీపీ అభిమానులు సైతం బన్నీని తప్పుబట్టారు. వారిలోనూ బన్నీ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఐతే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలిచి అధికారం చేపట్టింది. మెగా అభిమానులతోనే కాక టీడీపీ ఫ్యాన్స్‌తోనూ ప్యాచప్ చేసుకోవాల్సిన స్థితిలో బన్నీ ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకునేలా ఈ పుస్తకం ఫొటోలో పడేట్లు డిస్‌ప్లేలో పెట్టాడనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ యాదృచ్ఛికంగానే కూడా ఆ పుస్తకం అక్కడ ఉండి ఉండొచ్చు. మొత్తానికి ఈ పుస్తకం బన్నీ ఇంట్లో ఉండడం, ఫొటోలో పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.