శ్రీవారి భ‌క్తుల‌కు అద్భుత ఛాన్స్‌… మిస్ కావొద్దు!

తిరుమ‌ల శ్రీవారిని ఒక్క నిమిషం ద‌ర్శించుకోవాల‌ని ప‌రిత‌పించే భ‌క్తులు కోట్ల‌లో ఉంటారు. అలానే తిరుమ‌ల ప్రసాదాన్ని ప‌ర‌మ‌ప‌విత్రంగా కూడా భావిస్తారు. ఇక‌, తిరుమ‌ల శ్రీవారికి ధ‌రింప‌చేసి.. తీసేసిన శేష వ‌స్త్రాల‌ను అందుకోవాల‌ని ప్రతి భ‌క్తుడికీ ఉంటుంది. కానీ, సాధ్యం కాదు. వీఐపీలు, వీవీఐపీల‌కు మాత్ర‌మే టీటీడీ ఈ స‌ద‌వ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. దీంతో తిరుమ‌ల శ్రీవారి శేష‌వ‌స్త్రాలు అందుకునే భాగ్యం.. ఏ కొద్ది మందికో ప‌రిమిత‌మైంది.

తాజాగా.. తిరుమ‌ల అధికారులు శేష వ‌స్త్రాల‌ను సొంతం చేసుకునే అవ‌కాశం సాధార‌ణ భ‌క్తుల‌కు కూడా క‌ల్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ వేలంలో శ్రీవారికి ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నాయి. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించవచ్చున‌ని అధికారులు తెలిపారు.

అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.konugolu.ap.govt.in / www.tirumala.org సంప్రదించగలరని తెలిపారు. ఈ అవ‌కాశం ఏటా క‌ల్పిస్తున్నా.. ఈ ఏడాది మ‌రిన్ని విభిన్న వ‌స్త్రాల‌ను అందుబాటులో ఉంచిన‌ట్టు అధికారులు తెలిపారు. భ‌క్తుల డిమాండ్ ఆధారంగా ఈవేలం నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.