షర్మిల పార్టీపై ఈటెల వ్యాఖ్యలు.. ‘మతం’ బురద అంటిస్తున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న ముద్దుల కుమార్తె షర్మిల. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్కు పూర్తి చేయటమే కాదు.. ఇటీవల లోటస్ పాండ్ వద్ద అభిమానుల్ని.. వైఎస్ ఫాలోయర్లను పిలిపించిన మరీ భేటీ కావటం.. వారు చెప్పిన మాటల్ని శ్రద్ధగా వినటమే కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

దీంతో.. షర్మిల రాజకీయ పార్టీ ఉత్తుత్తి ప్రచారంగా ఫీలైన వారంతా.. జరిగిన పరిణామంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. తాము కలలో కూడా అనుకోనిది వాస్తవంగా తెర మీదకు రావటంతో.. పార్టీలన్ని ఒక్కసారిగా అలెర్టు అయి.. విమర్శనాస్త్రాల్ని సంధించటం షురూ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఈటెల రాజేందర్ తాజాగా స్పందించారు. షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభంపై తనదైన శైలిలో రియాక్టు అయ్యారు.

మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.కొత్త పార్టీ వస్తున్న క్రమంలో విమర్శలు మామూలే అయినా.. షర్మిల తన పార్టీ పేరు.. గుర్తుతో సహా ఏ విషయాల్ని వెల్లడించక ముందే.. మతం ముద్ర వేయటం చూస్తే.. షర్మిల పార్టీని దెబ్బ తీసే దిశగా ఈటెల లాంటి నేతలు రంగంలోకి దిగారా? అన్న సందేహం కలుగక మానదు. షర్మిల పార్టీపై ఈటెల నేరుగా.. సూటిగా వ్యాఖ్యలు చేయనప్పటికి.. కొత్తగా వచ్చిన వారికి ఉండే అవకాశాల మీద మాట్లాడిన ఈటెల.. కొత్తగా వచ్చే వారికి తెలంగాణతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.

సెంటిమెంట్స్ ఎక్కువ కాలం పని చేయదని చెప్పిన ఆయన.. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాల వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు ఆగిపోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఈటెల మాటలు వ్యక్తిగతమా? పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మాట్లాడారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తానికి మతం అనే మరకను షర్మిల పార్టీకి అంటించే ఆలోచనలో ఉన్న విషయం తాజా వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. మరి.. ఈ తరహా ప్రచారాల్ని షర్మిల ఏ రీతిలో ఎదుర్కొంటుందో చూడాలి.