జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్…కండిషన్స్ అప్లై

కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానం వచ్చి కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయనను జైలు సిబ్బంది ప్రత్యేకమైన సెల్ కు తరలించి ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో జైలు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆరోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో, జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్న వీరిద్దరు…ఆ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, బెయిల్ పై విడుదలై బయటకు వెళుతున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న సీఐను దూషించారని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో, బెయిల్‌పై విడుదలైన తర్వాతి రోజే ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి మళ్లీ కడప జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కడప జైలులో రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి కరోనా సోకింది. దీంతో, ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం జేసీ ప్రభాకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.