సంతోష్ భార్యకు ఇంటిస్థలం అందజేత- విలువు 20 కోట్లు ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అంటే మాటే. ఎప్పుడైనా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే దాన్ని నోటి మాటలా కాకుండా సీరియస్ గా తీసుకుంటారు. లేదంటే.. మౌనంగా ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనం కోసం ఇచ్చే హామీల్ని వదిలి పెడితే. చాలా సందర్భాల్లో ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. అందులోకి ఎవరికైనా ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే హామీల విషయంలో మాత్రం ఆయన కమిట్ మెంట్ ను ఎవరూ శంకించరు.

ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులకు ట్రిపుల్ బెడ్రూం ఇస్తామని.. కరోనా వేళ జీతాలుఇవ్వని వారి యాజమాన్యాల తీరు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీరుస్తామని చెప్పే మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఏదైనా కీలక సమయాల్లో ఇచ్చే హామీల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు. సరిహద్దుల్లో చైనా సైనికుల దుర్మార్గంతో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు మరణం దేశ ప్రజల్ని విషాదంలోకి నెట్టింది.

ఈ సందర్బంగా వారింటికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఊహించని రీతిలో రూ.5 కోట్ల భారీ మొత్తాన్ని ఇవ్వటంతో పాటు.. సంతోష్ బాబు సతీమణికి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. వారికి హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామని మాట ఇచ్చారు. దీనికి తగ్గట్లే ఇటీవల మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్ని చూపించగా.. సంతోష్ బాబు కటుుంబం బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న 711 గజాల ఇంటి స్థలాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

దీంతో.. ప్రభుత్వం వారికి ఆ స్థలాన్ని తాజాగా అప్పజెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆ ఇంటి స్థలం విలువ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం రూ.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇంటి పట్టాను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి పరిశీలించి.. ఆ ఇంటి పత్రాల్ని స్వయంగా సంతోష్ సతీమణికి అందజేశారు. ఇలాంటి నిర్ణయాలే ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చేస్తాయంటున్నారు.