#ThankYouRahane ట్రెండింగ్

ఇది సోష‌ల్ మీడియా కాలం. ఈ మాధ్య‌మంలో చ‌ర్చ‌లు ప్ర‌ధానంగా సినిమా, క్రికెట్ చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ రెండు రంగాల్లో స‌క్సెస్ సాధించిన వాళ్ల‌ను ఒక్క‌సారిగా ఆకాశానికి ఎత్తేస్తారు. ఫెయిలైన వాళ్ల‌ను పాతాళానికి తొక్కేస్తారు. రెండు వైపులా ప‌దునుండే సోష‌ల్ మీడియాతో ఉన్న త‌ల‌నొప్పే ఇది. ఇంగ్గాండ్‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న టెస్టు సిరీస్‌లో బాగా ఆడిన వాళ్ల‌కు ఇస్తున్న ఎలివేష‌న్లు మామూలుగా లేవు. అదే స‌మ‌యంలో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న ఆట‌గాళ్ల‌ను అదే రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత‌ శ‌త‌కం సాధించిన ఓపెన‌ర్‌ రోహిత్ శ‌ర్మ‌.. శ‌నివారం సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయాడు. ట్విట్ట‌ర్లో ఎక్క‌డ చూసినా అత‌డి గురించే చ‌ర్చ‌. ఇక త‌ర్వాతి రోజు వ‌చ్చేస‌రికి ఫోక‌స్ అంతా ర‌హానె మీదికి మ‌ళ్లింది. ఈ రోజు ఆట‌లో హీరోలు.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో అర్ధ‌శ‌త‌కాలు సాధించిన‌ శార్దూల్ ఠాకూర్, రిష‌బ్ పంత్‌లే అయిన‌ప్ప‌టికీ.. ర‌హానె పేరే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. #ThankYouRahane అంటూ అత‌డి పేరు ట్విట్ట‌ర్లో తెగ ట్రెండ్ అయింది. ఇంత‌కీ ర‌హానె ఏం సాధించాడా అని చూస్తే.. డ‌కౌట‌య్యాడు. కొంత కాలంగా నిల‌క‌డ‌గా ఫెయిల‌వుతున్న ర‌హానె.. ప్ర‌స్తుత సిరీస్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. రెండో టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో ప‌ర్వాలేద‌నిపించాడు కానీ.. మిగ‌తా ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు.

శ‌నివారం రోహిత్, పుజారా ఎంతో క‌ష్ట‌ప‌డి ఇన్నింగ్స్‌ను నిల‌బెడితే.. ఆదివారం జ‌ట్టు త‌న నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ ఆశించిన స‌మ‌యంలో ర‌హానె డ‌కౌటై వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ర‌హానె జ‌ట్టు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న స‌మ‌యంలో 14 ప‌రుగులే చేసి వెనుదిరిగాడు. ఓవైపు సూర్య‌కుమార్ యాద‌వ్, పృథ్వీ షా లాంటి చాలామంది ప్ర‌తిభావంతులు అవ‌కాశం కోసం చూస్తుంటే జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఇంత పేల‌వంగా ఆడుతుండ‌టంతో అత‌డిపై వేటు వేయాల‌న్న డిమాండ్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ర‌హానె ప‌నైపోయింద‌ని.. భారత జ‌ట్టులో అత‌డి ప్ర‌స్థానం ముగిసిన‌ట్లే అని సూచిస్తూ ఇండియ‌న్ ఫ్యాన్స్ వ్యంగ్యంగా #ThankYouRahane హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.