ఆ సినిమా.. ‘బాహుబలి’కి దీటుగానే

ఆ సినిమా.. ‘బాహుబలి’కి దీటుగానే

‘బాహుబలి’ని కొట్టే సినిమా తీయాలని పట్టుదలతో ఉంది కోలీవుడ్. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ ప్రయత్నంలోనే ‘సంఘమిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్న సుందర్.. రెగ్యులర్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం చేశాడు. ప్రస్తుతం కేన్స్‌లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్‌లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న జయం రవి, ఆర్య, శ్రుతి హాసన్‌లతో పాటు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్.. నిర్మాతలతో కలిసి సుందర్ కేన్స్‌కు చేరుకున్నాడు. ‘సంఘమిత్ర’ టీం అక్కడ సందడి చేయడానికి ముందు.. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ ‘తెండ్రాల్ ఫిలిమ్స్’. అది చూస్తే.. ‘సంఘమిత్ర’ బాహుబలి బాటలోనే సాగుతుందని.. రాజమౌళి సినిమాకు దీటుగానే ఉంటుందని అర్థమవుతోంది.

భారీ ఓడలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో భయానక వాతావరణం మధ్య ప్రయాణిస్తుంటే.. అందులో ఒక ఓడపై ఓ యోధుడు నిలబడి ఉన్నాడు. బహుశా ఆ యోధుడు జయం రవినే కావొచ్చేమో. ఈ సెటప్ అదీ చూస్తే.. ‘సంఘమిత్ర’లో భారీతనానికి ఢోకా ఏమీ ఉండదని.. ‘బాహుబలి’ లాగా విజువల్ వండర్ అయ్యేందుకు ఆస్కారాలు లేకపోలేదని అనిపిస్తోంది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో దీనికి ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పాడు సుందర్.

రెండేళ్లుగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక వీఎఫెక్స్ స్టూడియోలతో కలిసి పని చేస్తున్నాడు. కాకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ సినిమా చేస్తున్నపుడు వేరే భాషల వాళ్లకూ కనెక్టయ్యే స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకోవాల్సింది. జయం రవి, ఆర్యలకు తమిళనాడు అవతల అంతగా ఫాలోయింగ్ లేదు. తమిళంలో కూడా వాళ్లిద్దరూ పెద్ద స్టార్లేమీ కాదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు