నాని.. పదెకరాలు.. ఆరున్నర కోట్లు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి హీరోగా ఎదిగిన నటుడు నాని. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ముందు వరకు అతను మామూలు హీరో. కానీ ఆ సినిమాతో అతను స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాతి కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగి ఇప్పుడు తన సినిమాతో రూ.40-50 కోట్ల మధ్య బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాడు. ఐతే తన సినిమాల బిజినెస్ పెరిగినప్పటికీ.. బడ్జెట్ల విషయంలో మాత్రం నాని జాగ్రత్త పడుతుంటాడు. సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లోనే సినిమాలు చేస్తుంటాడు. భారీతనం కోసం పట్టుబట్టడు.

కానీ తొలిసారి నాని మాత్రం ఈ పరిమితులను దాటేస్తున్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు నిర్మించడానికి ఒప్పందం కుదిరింది. కానీ బడ్జెట్ ఎక్కువ అయిందనే కారణంతోనే ఆ సంస్థ తప్పుకుంది. ఆ స్థానంలోకి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త బేనర్ వచ్చింది.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కోరుకున్నట్లే పెద్ద బడ్జెట్లో సినిమా చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడంతో రాజీ లేకుండా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం కోల్‌కతాలో పదెకరాల స్థలం అద్దెకు తీసుకుని ఏకంగా రూ.6.5 కోట్లతో ఒక భారీ సెట్ వేయడం విశేషం. ఈ చిత్రం కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంలో సాగుతుంది. ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్ చూస్తేనే ఇదొక వింటేజ్ మూవీ అని అర్థమవుతుంది. అసలే పాత రోజులు, పైగా కలకత్తా నగర నేపథ్యం అనేసరికి ఆర్ట్ విభాగానికి చాలా పని పడింది.

ఎంతో రీసెర్చ్ చేసి అప్పటి వాతావరణాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆధునిక పోకడలు కనిపించకుండా అప్పటి వాతావరణాన్ని తెరపైకి తేవడం కోసం ఇలా భారీ సెట్ నిర్మించారు. ఒక సెట్ కోసం ఆరున్నర కోట్లు పెట్టారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాని బడా స్టార్ల స్థాయిలో ఆలోచిస్తున్నట్లే. మరి ఇంత రిస్క్ చేస్తున్న నానికి రేప్పొద్దున బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.