సిద్దు జొన్నలగడ్డ ప్లానింగే వేరు

రెండేళ్ల నిరీక్షణకు తగ్గట్టు టిల్లు స్క్వేర్ రూపంలో అద్భుత ఫలితం అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా ప్లానింగ్ తో ఉన్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్, నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెలుసు కదా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కాకుండా టిల్లు క్యూబ్ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే సెట్స్ పైకి తీసుకెళ్తారు. డైరెక్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈసారి కూడా దర్శకుడిని మార్చి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ని ఓకే చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మ్యాడ్ 3 షూటింగ్ అయ్యేలోపు దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది.

అసలు వీటికన్నా ముందు సిద్ధూ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. కథ ఓకే అనుకుని అంతా రెడీ అనుకుంటున్న టైంలో అన్నీ మంచి శకునములే ఫ్లాప్ కావడంతో ఈ కాంబోకు బ్రేక్ పడింది. దీంతో నందిని రెడ్డి ఇటీవలే తేజ సజ్జకు ఒక లైన్ వినిపించారట. స్పందన సానుకూలంగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. సిద్దు మాత్రం స్టోరీ, డైరెక్టర్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాడని తెలిసింది. మొహమాటం కోసం రిస్క్ చేస్తే కెరీర్ ప్రమాదంలో పడుతుందని గుర్తించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు. తన ముందు అసలైన సవాల్ మరొకటి ఉంది.

ఇప్పటిదాకా సిద్ధూకి గుర్తింపు తెచ్చింది టిల్లు సిరీసే. తనకు మాత్రమే సాధ్యమయ్యే శరీర భాష, డైలాగు టైమింగ్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. కానీ జాక్ కోసం పూర్తిగా వేషం మార్చాడు. భాస్కర్ చూపించే విధానం కూడా కొత్తగా ఉంటుందట. వేరే జానర్, క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాల్సిన బాధ్యత సిద్దుపైన ఉంది. ఎంతసేపూ టిల్లు బ్రాండ్ మీద ఆధారపడలేడు కదా. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇవి కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ ఇచ్చిన కొత్త కమిట్ మెంట్స్ ఏమి లేవు. నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తూ క్రమంగా స్పీడ్ పెంచే దిశగా సినిమాలు ఎంచుకుంటున్నాడు.