ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే రాజ‌కీయం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. బ‌ల‌మైన అభ్య‌ర్థులు.. బ‌ల‌మైన ప్ర‌చారంతో ఈ రెండు పార్టీలు కూడా.. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ కంటే.. ఆ పార్టీ నేత‌ల బ‌ల‌మే ఎక్కువ‌గా ఉంది.

అవే.. అద్దంకి. ప‌రుచూరు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. గ‌త 2019లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని టీడీపీ గెలుచుకున్న సునాయాస స్థానాలు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఉన్న ఇద్ద‌రు నాయ‌కులు.. టీడీపీ కంటే కూడా.. ఒకింత బ‌లంగా ఉన్న నేత‌లేన‌ని స్థానికులు చెబుతున్నారు. అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్‌.. వ‌రుస‌గా నాలుగోసారి పోటీలో ఉన్నారు. ఇక‌, ప‌రుచూరులో ఏలూరి సాంబ‌శివ‌రావు.. వ‌రుస‌గా మూడో సారి త‌ల‌ప‌డుతున్నారు. కానీ, ఇద్ద‌రూకూడా గెలుపు గుర్రం ఎక్కుతార‌న‌డంలో సందేహం లేద‌ని చెబుతు న్నారు.

ప‌రుచూరు విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం.. ప్ర‌జ‌ల‌తోనే ఉండ‌డం.. క‌రోనా స‌మ‌యం లోనూ వారికి అండ‌గా నిలిచిన ప‌రిస్థితి ఏలూరికి ప్ల‌స్ అవుతోంది. అంతేకాదు.. వ్య‌వ‌సాయ ఆధారిత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న పోక‌స్ కూడా ఎక్కువ‌గా రైతుల‌పైనే చేశారు. వారికి అండ‌గా ఉన్నారు. ప్ర‌తి విష‌యంలోనూ నేనున్నానంటూ.. ముందుకు వ‌చ్చారు. నీటి నుంచి విత్త‌నాలు.. పురుగుల మందుల దాకా.. రైత‌ల‌ను చేయి ప‌ట్టిన‌డిపిస్తున్నారు. క‌రోనా టైంలో రైతుల‌కు ఉచితంగా మందు స్పేయ‌ర్లు పంపిణీ చేశారు.

దీంతో ఏలూరిపై అన్ని వ‌ర్గాల్లోనూ అభిమానం పెరిగింది. పైగా వివాదాల‌కు దూరంగా ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన అంశం. ఇక‌, అద్దంకిలో గొట్టిపాటి ర‌వి కూడా సొంత ఇమేజ్ ను న‌మ్ముకుని ముందుకు సాగుతున్నారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నా.. త‌ర్వాత ప‌రిణామాలతో టీడీపీకి జై కొట్టినా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను 2019లో విజ‌యం ద‌క్కేలా చేశారు. ఇక‌, ఇది వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే సాధ్య‌మైంద‌న్న విష‌యంలో సందేహం లేదు.

అదేవిధంగా స్తానికులు.. పిలిస్తే ప‌లుకుతాడు.. అనే మాట ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ వినిపిస్తోంది. వైసీపీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వీరి హ‌వా త‌గ్గించేందుకు కేసులు పెట్టినా.. కోర్టుల‌కు వెళ్లిన తీరు.. నిల‌బ‌డిన తీరు వంటివి.. వారిని హీరోలుగా నే నిల‌బెట్టింది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు వీరిదేన‌ని స్థానికంగా వినిపిస్తున్న మాట‌.