జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. తగిలింది చిన్న గాయమే అయినా.. దాని కోసం ఆసుపత్రికి వెళ్లి పెద్ద సర్జరీ జరిగినట్లు ఆసుపత్రి నుంచి ఫొటోలు రిలీజ్ చేయడం.. దాదాపు పది రోజుల పాటు జగన్ బ్యాండేజీలతో కనిపించడం.. రోజు రోజుకూ బ్యాండేజ్ సైజ్ పెరగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

రోజు రోజకూ బ్యాండేజ్ సైజ్ పెరగడం పట్ల ప్రధాన పత్రికల్లో ఫొటోలతో వార్తలు కూడా వచ్చాయి. ఎన్నికలు అయ్యే వరకు జగన్ బ్యాండేజీ తీయడనే కౌంటర్లు కూడా పడ్డాయి. మరోవైపు ఇలా గాయానికి గాలి తగలనీయకుండా బ్యాండేజ్ కొనసాగిస్తే గాయం మానదని.. సెప్టిక్ అవుతుందని డాక్టర్ అయిన జగన్ సోదరి సునీత కౌంటర్ కూడా వేయడం తెలిసిందే.

ఐతే తన గాయం, బ్యాండేజీ విషయంలో సానుభూతి రాకపోగా ఈ వ్యవహారం బూమరాంగ్ అవుతోందన్న ఫీడ్ బ్యాక్ జగన్‌కు చేరిందో ఏమో.. ఈ రోజు ఆయన బ్యాండేజీ తీసేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బ్యాండేజీ లేకుండా కనిపించారు. ఐతే బ్యాండేజీ తీసేశాక గాయం ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదు.

జగన్‌ మీద హత్యా యత్నం జరిగిపోయినట్లు.. గాయానికి కుట్లు కూడా వేసినట్లు ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు చూస్తే చిన్న గీత పడ్డట్లు తప్పితే అక్కడ పెద్ద గాయమైనట్లు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గాయం ఎప్పుడో మానిపోయినట్లు కనిపిస్తున్నా.. నిన్నటి వరకు జగన్ పెద్ద పెద్ద బ్యాండేజీలు వేసుకుని ఎందుకు కనిపించారన్నది అర్థం కాని విషయం. అసలక్కడే దెబ్బే తగలనట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.