అవినాష్ ఎఫెక్ట్‌: లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్న జ‌గన్

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచార‌ణ‌కు పిల‌వ‌డం.. ఇప్ప‌టికే ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిని (సీఎం జ‌గ‌న్ భార్య భార‌తి సొంత మేన‌మామ‌) అరెస్టు చేసి జైల్లో పెట్టిన నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ దంప‌తులు త‌మ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఎప్పుడు .. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో తాము అందుబాటులో ఉండాల‌ని జ‌గ‌న్ దంప‌తులు భావించిన‌ట్టు తెలిసింది. అందుకే.. వారు లండ‌న్ ప‌ర్య‌ట‌నను రద్దు చేసుకున్నార‌ని స‌మాచారం.

షెడ్యూల్ ప్ర‌కారం..
ఈ నెల 21 న కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్డ్ విమానంలో లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెల వద్దకు వెళ్లాలని జగన్ దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం కావడం, తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన రద్దు అయినట్లు సమాచారం.

లండన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు జగన్ దంపతులు ప్రతీ సంవత్సరం వెళ్తుంటారు. గత ఏడాది ఆమె డిగ్రీ పట్టా పొందిన సందర్భంలో జగన్‌ దంపతులు ప్రత్యేకంగా హాజరయ్యారు. 2021లో కుమార్తెల సమక్షంలో జగన్‌ దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. అయితే 2022 మే20న వీరు లండన్‌ వెళ్లినప్పుడు వివాదం తలెత్తింది. 2019 నుంచి ఏప్రిల్‌, మే నెలల్లో జగన్‌ లండన్‌ వెళ్లిరావడం ఆనవాయితీగా మారిపోయిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రత్యేక విమానంలో వెళ్లడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.