తారకరత్నకు ఛాన్స్ ఇద్దామనుకున్నాం – చంద్రబాబు

సినిమా కెరీర్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాక.. రాజకీయాల వైపు అడుగులు వేసి.. అందులోనైనా విజయవంతం కావాలని, మంచి స్థాయిని అందుకోవాలని అనుకున్నాడు నందమూరి తారకరత్న. కానీ అతడి ప్రయాణం ఆరంభంలోనే ఆగిపోయింది. నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర తొలి రోజు తన బావతో కలిసి అడుగులు వేస్తున్న సమయంలో తారకరత్నకు గుండెపోటు రావడం.. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మృత్యువుతో పోరాడడం.. చివరికి శివరాత్రి రోజు శివైక్యం కావడం అందరినీ కలచివేసింది.

ఈ దురదృష్ట ఘటన జరగకపోయి ఉంటే.. తారకరత్న ఏడాది తర్వాత ఎమ్మెల్యేగా చూసేవాళ్లమేమో. ఎందుకంటే అతను పార్టీ నుంచి టికెట్ ఆశించాడట. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే వెల్లడించారు.

తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘చిన్న వయసులోనే తారకరత్న చనిపోవడం పట్ల ఎంతో బాధ కలుగుతోంది. ఆయన కోలుకుని మళ్లీ వస్తారని ఆశించాం. సినీ రంగంలో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ఒకే రోజు 9 సినిమాల ప్రారంభోత్సవం చేశారు. రాజకీయాల పట్ల తారకరత్న ఆసక్తి చూపించేవాడు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అతడికి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. దీనిపై సరైన సమయం వచ్చినపుడు మాట్లాడతానని చెప్పాను. కానీ ఈలోపే ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని చంద్రబాబు అన్నారు. తారకరత్న కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినట్లు సమాచారం.