ప‌వ‌న్‌కు పాల్‌కు ముడిపెట్టి స‌టైర్లు వేసిన ఏపీ మంత్రి

ఏపీ సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్ప‌డుతాయ‌ని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ క‌ళ్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని ప్ర‌శ్నించారు. పవన్ అరుపులకు ఎవరూ భయప డరని మంత్రి బొత్స హెచ్చరించారు. పవన్ రాజకీయాలు చూస్తుంటే విరక్తి కలుగుతోందని, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌కు.. పవన్‌కు పెద్ద తేడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. పవన్ బాగా డబ్బు ఖర్చు పెట్టి వారాహి వాహనం చేయించుకున్నారని, రాష్ట్రమంతా తిరుగు.. నిన్ను ఎవరు వద్దన్నారు? అని ప్ర‌శ్నించారు.

ఉగాది నాటికి విశాఖకు రాజధాని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే రాజ‌ధానికి సంబంధించి విష‌యాలు కూడా బ‌య‌ట పెడ‌తామ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని అన్నారు. ముంద‌స్తు ముచ్చ‌టే రాబోద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి సంక్షేమాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా తీసుకుంద‌ని మంత్రి బొత్స తెలిపారు. మొత్తానికి ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సంచ‌ల‌నంగా మారాయి.