ప్ర‌తినిధిని కొంచెం లేపాల్సింది

ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా ఉండేవాడు టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్. ఒకే స‌మయంలో అర‌డ‌జ‌ను సినిమాలకు పైగా లైన్లో పెట్టిన అత‌ను.. కొన్నేళ్ల పాటు సినిమానే చేయ‌కుండా సైలెంట్‌గా ఉండిపోవ‌డం ఆశ్చ‌ర్యం కలిగించే విష‌యం. చాలా గ్యాప్ త‌ర్వాత అత‌ను న‌టించిన సినిమా ప్ర‌తినిధి-2. త‌న కెరీర్లో ప్ర‌త్యేక‌మైన చిత్రాల్లో ఒక‌టైన ప్ర‌తినిధి స్ట‌యిల్లోనే చేసిన రాజ‌కీయ సినిమా ఇది.

ఈ చిత్రంతో న్యూస్ ప్రెజెంట‌ర్ మూర్తి ద‌ర్శ‌కుడిగా మార‌డం విశేషం. ఈ సినిమా మొద‌లైన‌పుడు బాగానే ఆస‌క్తి రేకెత్తించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా పూర్తి కావ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌ రిలీజ్ విష‌యంలోనూ ఆల‌స్యం త‌ప్ప‌లేదు. ఐతే ఎట్ట‌కేల‌కు అన్ని అడ్డంకులనూ దాటుకుని శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఐతే ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి ప‌తాక స్థాయికి చేరుకున్న స‌మ‌యంలో రిలీజ‌వుతున్న ఈ పొలిటిక‌ల్ మూవీకి ఆశించినంత హైప్ క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ర్ష‌ణీయంగానే అనిపించాయి. కానీ రిలీజ్ ఆల‌స్యం కావ‌డం, ప‌బ్లిసిటీ స‌రిగా చేయ‌క‌పోవ‌డం, బాక్సాఫీస్‌లో కొన్ని వారాలుగా కొన‌సాగుతున్న డ‌ల్ వాతావ‌ర‌ణం దీనికి మైన‌స్ అయిన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీంతో పాటు రిలీజ‌వుతున్న కృష్ణ‌మ్మ‌కు కూడా బ‌జ్ లేదు.

ఐతే ఇప్పుడు జ‌నాలున్న మూడ్‌లో మామూలుగా అయితే ప్ర‌తినిధి-2 లాంటి సినిమా చూడ‌డానికి ఆస‌క్తి చూపించాలి. కానీ సినిమా రిలీజ‌వుతున్న విష‌య‌మే జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీలో అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తున్న ఈ చిత్రాన్ని టీడీపీ వాళ్ల‌యినా కొంచెం పైకి లేపాల్సింది. పార్టీ త‌ర‌ఫున దీన్ని పుష్ చేయాల్సింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమాకు మంచి టాక్ వ‌స్తే అప్పుడైనా ప్ర‌తినిధి-2ను టీడీపీ వాళ్లు పైకి లేపుతారేమో చూడాలి.