ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు 

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి లేకపోయినా బాగుందనే టాక్ తెచ్చుకుంటే థియేటర్లకు జనం వస్తారనే నమ్మకంతో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారు. మే 13 పోలింగ్ డేట్ ఇంత దగ్గరగా పెట్టుకుని విడుదల ప్లాన్ చేసుకోవడం ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది పెట్టే అంశమే. అయినా నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం మహా అయితే యాభై నుంచి అరవై మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇళ్లలో ఖాళీగా ఉండలేక థియేటర్లకు వెళదామని ప్లాన్ చేసుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుందని బయ్యర్ల అభిప్రాయం. 

సత్యదేవ్ ‘కృష్ణమ్మ’కు సమర్పకుడు కొరటాల శివ దగ్గరుండి ప్రమోషన్లు చూసుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాస్ కి నచ్చే అంశాలు చాలానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సెన్సార్ వల్ల వాయిదా పడిన నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ల వేడిని మిస్ కాకూడదనే ఉద్దేశంతో మే 10నే వస్తోంది. వర్తమాన రాజకీయాల మీద బలమైన సెటైర్లు ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. వాయిదాల పర్వంలో నలిగిన ‘జితేందర్ రెడ్డి’ని అదే రోజు దింపుతున్నారు. ఇవి కాకుండా ‘ఆరంభం’ అనే కాన్సెప్ట్ మూవీ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. 

ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే హాలీవుడ్ కోతుల మూవీ ‘కింగ్ డం అఫ్ ది ప్లానెట్ అఫ్ ది యేప్స్’ని భారీ ఎత్తున ఇండియాలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మన స్ట్రెయిట్ సినిమాలను వసూళ్ల పరంగా బాగానే దెబ్బేసింది. ఇప్పుడు రాకాసి కోతుల కథ కాబట్టి పిల్లలు, యూత్ ఎగబడతారనే అంచనాలున్నాయి. పోటీ అయితే రసవత్తరంగా ఉంది కానీ జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లో లేని ఇలాంటి పరిస్థితుల్లో ఇవి పబ్లిక్ ని ఆకట్టుకోవడం చాలా అవసరం. మరి సత్యదేవ్, రోహిత్ లు తమ పోటీదారులతో పాటు ఇంగ్లీష్ కోతులను ఎలా ఎదురుకుంటారో చూడాలి.