భారతీయుడు కంటే గేమ్ ఛేంజరే ఎక్కువ

విడుదలకు ఇంకా బోలెడు సమయమున్నా ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీల్స్ పూర్తవుతున్నాయి. పుష్ప 2 ది రైజ్ హిందీ హక్కులను రెండు వందల కోట్లకు కొన్నారన్న వార్త ఇప్పటికే ముంబై నుంచి హైదరాబాద్ దాకా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓటిటి హక్కులను సైతం కనివిని ఎరుగని రేటుకి నెట్ ఫ్లిక్స్ కొన్నదన్న టాక్ వచ్చినా సరైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలాగా ఉండగా రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ఉత్తరాది థియేట్రికల్ రైట్స్ ని సుమారు 75 కోట్లకు ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్.

ఇదే శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో చేస్తున్న భారతీయుడు 2 కేవలం 20 కోట్ల రేటే పలికిందట. ఇంత వ్యత్యాసం ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు ఉత్తరాదిలో ఫాలోయింగ్ పెరిగింది. ఆచార్యలో క్యామియోని మినహాయిస్తే ఆ సినిమా తర్వాత సోలో హీరోగా తను చేస్తున్న మూవీ ఇదే. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. పైగా జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యం వల్ల బిజినెస్ బాగా జరిగేందుకు దోహదపడుతోంది. ఇంకోవైపు ఇండియన్ 2ని బడా సంస్థ లైకా అయినా కంటెంట్ దృష్ట్యా దానికి విపరీతమైన బజ్ ఏర్పడటం లేదు.

దీన్ని బట్టే హైప్ విషయంలో భారతీయుడు కన్నా గేమ్ ఛేంజర్ ఎంత ముందు ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు విడుదల తేదీలు శంకర్ ఇంకా నిర్ణయించలేదు. కూతురు పెళ్లి పనుల్లో మొన్నటిదాకా బిజీగా ఉండటంతో నిర్మాతలు చర్చలు గట్రా పెట్టుకోలేదు. ఇప్పుడా లాంఛనం పూర్తయ్యింది కాబట్టి ఇంకో వారం పది రోజుల్లో డెసిషన్ తీసుకుంటారు. జూన్ 13 లేదా 14 భారతీయుడు 2 కోసం పెట్టుకున్న ఆప్షన్స్. గేమ్ ఛేంజర్ కోసం అక్టోబర్ చివరి వారం వైపు చూస్తున్నారు. అదే నెలలో వస్తున్న రజినీకాంత్ వెట్టయన్ తేదీ తర్వాతే ఫిక్స్ అవుతారు. కొంచెం టైం పట్టేలా అయితే ఉంది.