సెన్సేషనల్ ఆవేశం డబ్బింగా రీమేకా

గత కొంత కాలంగా మలయాళం డబ్బింగ్ సినిమాలకు తెలుగులో గిరాకీ పెరిగింది. ప్రేమలు 17 కోట్లు, మంజుమ్మల్ బాయ్స్ 10 కోట్లు వసూలు చేయడంతో అక్కడ హిట్ టాక్ వచ్చిన వాటి మీద మనవాళ్ళు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. భ్రమయుగం, గోట్ లైఫ్ ఆడు జీవితం లాంటివి ఇక్కడ నిరాశపరిచినా మరీ నిండా ముంచేసే రేంజ్ లో కొన్నవి కాదు కాబట్టి నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా కేరళలో వసూళ్ల దుమ్ము దులుపుతున్న ఆవేశంని త్వరలో టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకపోతే అది అనువాదమా లేక రీమేకా అనే సమాధానం కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

అంతర్గత సమాచారం ప్రకారం ఆవేశం డబ్బింగ్ రూపంలోనే రానుంది. ఒకరిద్దరు హీరోలు దర్శకులు రీమేక్ ఆలోచన చేసినప్పటికీ ఇప్పటికిప్పుడు హక్కులు కొని, స్క్రిప్ట్ రాసి, సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసే లోపు ఎంతలేదన్నా ఏడాది గడిచిపోతుంది. ఈలోగా సదరు ఆవేశం ఓటిటిలో వచ్చేయడం, జనాలు ఉండబట్టలేక సబ్ టైటిల్స్ తో చూసేయడం జరిగిపోతాయి. అసలు సమస్య అది కాదు. ఫహద్ ఫాసిల్ పెర్ఫార్మన్స్ ని మ్యాచ్ చేసే హీరోని ఇక్కడ సెట్ చేసుకోవడం. ఒకవేళ ఒకరిద్దరి పేర్లు అనుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఇన్ని తలనెప్పులున్నాయి.

ఎలాగూ ఫహద్ ఫాసిల్ కు మనదగ్గర మార్కెట్ ఉంది. పుష్పలో విలన్ గా చేశాక సరిపడా గుర్తింపు వచ్చింది. సో కనెక్ట్ అవ్వడన్న సమస్యే లేదు. ప్రస్తుతం వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న ఆవేశం ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో మంచి వసూళ్లతో ఆడుతోంది. వీలైనంత త్వరగా తీసుకొస్తే మంచి స్పందన దక్కుతుంది. మంజుమ్మల్ బాయ్స్ ని ఆలస్యం చేయడం వసూళ్ల పరంగా కొంత ప్రభావం చూపించింది. వెరైటీ క్యారెక్టరైజేషన్ తో రౌడీ రంగాగా ఫహద్ ఫాసిల్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. మరి టాలీవుడ్ ఆడియన్స్ కి ఆవేశం ఎంతమేర నచ్చుతుందో వేచి చూడాలి.