తమన్ మళ్ళీ టార్గెట్ అయ్యాడు

విడుదలైన గంటల వ్యవధిలోనే గేమ్ ఛేంజర్ జరగండి జరగండి పాట మీద అభిమానులు, మ్యూజిక్ లవర్స్ మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. ఆశించిన స్థాయిలో లేదని ఒక వర్గం, దీనికన్నా ఇదే హీరో హీరోయిన్ కాంబినేషన్ లో బోయపాటి శీను తీసిన వినయ విధేయ రామ సాంగ్ బాగుందని మరో వర్గం ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డాన్సు మూమెంట్స్ కూడా అంతగా లేవని ప్రభుదేవా మాస్టర్ ని నిలదీస్తున్నారు. పాజిటివిటీ కంటే నెగటివిటీ ఎక్కువగా కనిపించడం ఈ మధ్య తమన్ కంపోజింగ్స్ కు అతి మాములు విషయంగా మారిపోయింది.

గుంటూరు కారం టైంలోనూ ఇలాంటి కామెంట్స్ బోలెడు చూశాడు తమన్. ముఖ్యంగా ఓ మై బేబీ గురించి చిన్నపాటి ఆన్ లైన్ యుద్ధమే జరిగింది. తర్వాత కుర్చీ మడతపెట్టి చాలా మటుకు ఈ డ్యామేజ్ ని కవర్ చేసింది. తనకు నటుడిగా తొలి అడుగు వేయించిన గురువుగా దర్శకుడు శంకర్ మీద తమన్ కు అపారమైన గౌరవం ఉంది. ఆ కారణంతోనే బెస్ట్ ఆల్బమ్ ఇస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. కానీ దానికి భిన్నంగా జరగండి ఉందని, బాలీవుడ్ గాయకుడు దలేర్ మెహేంది స్వరం కూడా ఎప్పుడూ వినేలా లేదని అనుకుంటున్నారు. ఇదంతా సీరియస్ గా చూడాల్సిన ఫీడ్ బ్యాకే.

కేవలం ఈ ఒక్క పాట ఆధారంగా గేమ్ ఛేంజర్ కి తమన్ చేసిన వర్క్ మీద ఒక అభిప్రాయానికి రాలేం కానీ అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలానే సూత్రం పాటించే సోషల్ మీడియాలో మొదటి కంటెంట్ ఎప్పుడైనా సరే బెస్ట్ ఉండాలి. లేదంటే ఇవే సమస్యలు వస్తాయి. ఇది కాసేపు పక్కనపెడితే తమిళ లిరిక్స్ గురించి ఆ భాష వచ్చినవాళ్లు ఇంకా స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. మెల్లగా ఈ జరగండి జరగండి ఎక్కొచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం సిక్సర్ కొట్టాల్సిన బాల్ కేవలం రెండు పరుగులతో సర్దుకున్నట్టు అయ్యింది. ఇంకా బోలెడు మ్యాచ్ ఉందిగా చూద్దాం.