సింపతీ కోరుకుంటున్న యాక్షన్ హీరో

కొన్నిసార్లు ఒక సినిమాకు పని చేసిన వ్యక్తుల మీద ప్రేక్షకుల్లో సానుకూల భావన ఉండడం వల్ల లేదా సింపతీ వల్ల కూడా కొన్ని సినిమాలు అంచనాలను మించి ఆడేస్తుంటాయి. ఈ మధ్యే వచ్చిన ‘గామి’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఆ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టడానికి ఆరేళ్ల పాటు టీం పడ్డ కష్టం గురించి ప్రేక్షకులకు తెలవడం వల్ల ఏర్పడిన సానుకూల భావన, సింపతీనే కారణం.

గత ఏడాది షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి.. రిలీజ్ ముంగిట షారుఖ్‌ను కొన్ని వర్గాలు అదే పనిగా టార్గెట్ చేయడం ఒక కారణం. అందుకే ప్రేక్షకుల మెప్పు పొందేలా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రవర్తించడం, మాట్లాడ్డం కీలకం. అన్నిసార్లూ, అందరికీ సింపతీ వర్కవుటవుతుందన్న గ్యారెంటీ లేదు కానీ.. కొన్నిసార్లు మాత్రం ఈ మంత్రం పని చేస్తుంది.

ఈ విషయాన్ని గ్రహించే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం ‘బడేమియా చోటేమియా’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. తన సినిమాలు వరుసగా 16 ఫ్లాపైన విషయాన్ని అతను అంగీకరించాడు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ప్రేక్షకుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని అతనన్నాడు. వరుసగా 16 ఫ్లాపులొచ్చినా నిలబడడం అంటే చిన్న విషయం కాదు.

ఒకప్పుడు హిట్ల మీద హిట్లు కొట్టిన అక్షయ్‌కి కొన్నేళ్లుగా అసలు కలిసి రావడం లేదు. రకరకాల జానర్లలో  సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ‘బడేమియా చోటమేయా’ ట్రైలర్ బాగున్నా సరే.. ‘పఠాన్’ తరహా చాలా సినిమాలను తలపించేలా ఉంది. ఐతే ఈ సినిమా మీద ధీమాగా ఉన్న అక్షయ్.. రిలీజ్ ముంగిట ప్రేక్షకుల్లో తన పట్ల సానుకూల భావన, సానుభూతి కలిగేలా వరుస ఫ్లాపుల గురించి మాట్లాడాడు. మరి ఏప్రిల్ 10న రిలీజయ్యే ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్నందిస్తారో చూడాలి.