బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొనే వాళ్లు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సినది… ఏ హౌస్మేట్ని తక్కువ చేయకూడదని. బయట ఎవరు ఎంత గొప్పవాళ్లయినా కావచ్చు కానీ హౌస్లోకి వెళ్లిన తర్వాత అందరూ సమానమే. అందుకే బిగ్బాస్ హౌస్లో ఎవరికీ ప్రత్యేక మర్యాదలుండవు. అందరూ వంట చేయాలి, అందరూ బాత్రూమ్లు కడగాలి, అందరికీ ఒకే తరహా మంచాలు, కంచాలుంటాయి. అయితే వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్లను, లేదా అంతగా పాపులర్ కాని వాళ్లను కాస్త పేరున్న వాళ్లు అణచి వేయాలని చూస్తుంటారు.
తమకు ఫాన్స్ వున్నారు కనుక తమ స్థానానికి ఎలాంటి సమస్య వుండదని అనేసుకుంటారు. కానీ అంతిమంగా విజేతలవ్వాలంటే మాత్రం షో ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుని తీరాలి. అందుకే కౌషల్ అయినా, రాహుల్ అయినా విజేతలయ్యారు. ఈ సీజన్లో హౌస్మేట్స్ అస్సలు లెక్క చేయని ఇద్దరు కంటెస్టెంట్లు కుమార్ సాయి, అరియానా గ్లోరీ. కమెడియన్ కుమార్ సాయి అయినా నిజంగానే బద్ధకంగా వుంటున్నాడు కానీ అరియానా మాత్రం తనవంతుగా పూర్తి ఎఫర్టస్ పెడుతోంది. అయితే ఆమెను అభిజీత్, హారిక, సోహైల్ లాంటి కొందరు చిన్నచూపు చూస్తున్నారు. ఆమె ఏమి మాట్లాడినా, ఆటలో ఎలాంటి సలహాలిచ్చినా తీసి పారేస్తున్నారు.
అయితే అరియానా దాని గురించి ఎక్కడా రచ్చ చేయడం లేదు. తన వాదన వినిపిస్తోందే కానీ తనను ఇల్ట్రీట్ చేస్తున్నారని డ్రామా కూడా చేయడం లేదు. ఇదంతా ప్రేక్షకులు గమనిస్తున్నారు కనుక ఆమెకు సడన్గా గ్రాఫ్ రైజ్ అయింది. ఈ వారం ఎలిమినేట్ అయిపోతుందేమో అనుకున్నారు కానీ ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ప్రేక్షకుల నుంచి భారీగానే ఓట్లు పడుతున్నాయి. ఆమె పట్ల హౌస్మేట్స్ ప్రవర్తిస్తోన్న తీరుని నాగార్జున ప్రశ్నించినట్టయితే, వాళ్లు తమ తప్పుని గ్రహించినట్టయితే ఓకే కానీ లేదంటే అరియానా కూడా ప్రేక్షకుల సపోర్ట్ తో టైటిల్ కంటెండర్ అయిపోతుంది.