విశాఖ‌లో టీడీపీలో మారిన ప్రాధాన్యం.. బాబు వ్యూహం ఫ‌లించేనా?

మార్పులు స‌హజం. అవి సాధార‌ణ వ్య‌క్తుల‌కైనా.. రాజ‌కీయ నేత‌ల‌కైనా! అవ‌స‌రానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటేనే.. రాజ‌కీయాల్లో నేత‌ల‌కు లైఫ్ ఉంటుంది. పార్టీకి ప్ర‌జ‌ల్లో బ‌లం ఉంటుంది. లేక‌పోతే.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా వ్య‌వ‌హారం మారిపోతుంది.

ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టింది. అధికార పార్టీ దూకుడుతో .. నాయ‌కులు జంప్ చేయ‌డం, లేదా.. మౌనం పాటించ‌డం వ‌ల్ల టీడీపీ త‌ర‌పున గ‌ళం వినిపించే నాయ‌కులు క‌రువ‌య్యారు.

దీంతో కీల‌క‌మైన జిల్లాల్లో పార్టీ మోసేవారు.. ప్రభుత్వాన్ని దులిపేసేవారు కూడా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు తాజాగా అత్యంత కీల‌క‌మైన విశాఖ జిల్లాపై దృష్టి పెట్టారు. ఇక్క‌డి య‌ల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే ఇటీవ‌ల పార్టీ మారి.. జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. అదే స‌మ‌యంలో విశాఖ పార్టీ ఇంచార్జ్ రెహ‌మాన్ కూడా సైకిల్ దిగేశారు.

నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీడీపీ త‌న ఖాతాలో వేసుకున్నా.. ఒక్క వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు త‌ప్ప‌.. ఎవ‌రూ మాట్లాడడం లేదు. మ‌రీ ముఖ్యంగా మాజీ మంత్రి.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. బెల్లం కొట్టిన రాయ‌ల్లే మారిపోయార‌నేది బాబుకు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఇంకా ఉపేక్షిస్తే.. పార్టీ ప‌రువు మ‌రింత దిగ‌జారుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు.. ప‌క్క‌న పెడ‌తామ‌నుకున్న మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు ప్రాధాన్యం పెంచుతున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి త‌ర్వాత‌.. బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా మార‌డంతో బాబు ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. కానీ, ఇటీవ‌ల మారిన ప‌రిణామాల‌తో.. ఆయ‌న‌కు ప్రాధానం పెంచుతున్నారు. దీంతో అయ్య‌న్న దూకుడు పెంచారు.

ఇక‌, ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబుకు కూడా చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యేల్లో ఆయ‌న ఒక్క‌రే ఉండ‌డంతో గ‌తంలో ఆయ‌న‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. ఇప్పుడు మాత్రం వెల‌గ‌పూడికి రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నారు. దీంతో జిల్లాలో పార్టీ దిగ‌జార‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వీరు ఏమేర‌కు పార్టీని కాపాడ‌తారో చూడాలి.