ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అమరావతిపై విచారణలో ఉన్న 75 వ్యాజ్యాల విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు కౌంటరు దాఖలు చేసే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాలని ఈరోజు జనసేన అధ్యక్షుడు … పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో నిర్ణయించారు. అనంతరం కౌంటరు దాఖలు చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు.
వైసీపీ, టీడీపీలు తమ ఆధిపత్య ధోరణికి అమరావతిని బలిచేస్తున్నాయని అన్నారు. ఒక కొత్త రాజధాని నిర్మించుకునే అవకాశాన్ని, విలువైన సమయాన్ని ఈ పార్టీలు వృథా చేస్తున్నాయని జనసేన నాయకత్వం అభిప్రాయపడింది. కౌంటరును బలంగా దాఖలు చేస్తామని పేర్కొంది. అమరావతియే రాజధానిగా కొనసాగాలని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనక పోయినా “ఇప్పటికే కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది, రాష్ట్రం 6500 కోట్లు ఇచ్చింది. మొత్తం 9 వేల కోట్లు అమరావతిలో ఖర్చుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనం వృథా అవడాన్ని జనసేన సహించదు, అమరావతిలో చక్కటి జలవనరుల లభ్యత ఉంది” అని చెప్పడం ద్వారా అమరావతిలో రాజధాని కొనసాగాలన్న అభిప్రాయాన్ని జనసేన కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. కౌంటరు దాఖలు చేసేటపుడు కూడా ఈ విషయాన్నే తెలపనున్నారు.
ప్రభుత్వాన్ని విశ్వసించి తమ 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన 28 వేల మంది రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. వారి వైపు తుదివరకు నిలబడతాం. మనకు పర్యావరణహితమైన రాజధాని అవసరం ఉంది అని పవన్ పేర్కొన్నారు.