టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు బాగా కాస్ట్లీ అని.. అతను బాగా కమర్షియల్ అని పేరుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మహేష్ పారితోషకం పెరిగిపోతుంటుంది. అతడి సినిమాల బడ్జెట్లూ పెరిగిపోతుంటాయి. సినిమాల నుంచే కాక కమర్షియల్స్ ద్వారా.. వేరే వ్యాపారాల నుంచి భారీగా ఆదాయం ఆర్జిస్తుంటాడు మహేష్. ఐతే ఇదంతా మహేష్‌లోని ఒక కోణమే. అతడిలో మరో కోణం ఉంది. దాని గురించి చాలామందికి తెలియదు. అతనూ పెద్దగా ప్రచారం చేసుకోడు. మహేష్ ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించాడంటే నమ్మగలరా? నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది నిజం. తాజాగా అతను 1010వ ఆపరేషన్ చేయించాడు.
అత్యవసర స్థితిలో ఉన్న ఓ పాపకు శస్త్ర చికిత్స అవసరమై.. ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్లో మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. మహేష్ చిన్న పిల్లలకు సర్జరీలు చేయిస్తాడన్న వార్తలు చదివి.. అతను ఓ ప్రయత్నం చేశాడు. మహేష్‌కు విషయం చేరేలా చూడాలని నెటిజన్లకు కూడా అప్పీల్ ఇచ్చాడు. ఐతే అతడిని ఆశ్చర్యానికి గురి చేస్తూ మహేష్ టీం నుంచి కాల్ వెళ్లింది.
ఆ చిన్నారికి మహేష్ ఫౌండేషన్ తరఫున శస్త్ర చికిత్స చేయించారు. సర్జరీ సక్సెస్ అయింది. పాప ప్రాణాలు నిలిచాయి. కోలీవుడ్లో రాఘవ లారెన్స్ ఇలాగే చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయిస్తుంటాడు. అతను ఇప్పటిదాకా 130 మంది ప్రాణాలు నిలబెట్టాడు. దానికే అతణ్ని అక్కడవాళ్లు ఆకాశానికెత్తేస్తుంటారు. మహేష్ బాబు ఏకంగా 1010 సర్జరీలు చేయించాడంటే అతడిదెంత పెద్ద మనసో చెప్పేదేముంది?
Gulte Telugu Telugu Political and Movie News Updates