సుశాంత్‌ను త‌ప్పించ‌లేదు.. అత‌నే చేయ‌లేదు

సంచ‌ల‌నం రేపిన బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారానికి సంబంధించి పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది. బాలీవుడ్లో ఓ వ‌ర్గం సుశాంత్‌ను అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. ఈ క్ర‌మంలో అత‌ను డిప్రెష‌న్‌కు గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్లో ప‌లువురు ప్ర‌ముఖుల‌ను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ పోలీసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. బ‌న్సాలీ.. సుశాంత్‌తో సినిమా చేసేందుకు ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ప్ర‌య‌త్నించాడ‌ని.. ఓ సినిమా ప‌ట్టాలెక్కిన‌ట్లే ఎక్కి ఆగిపోయింద‌ని మీడియా పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే బ‌న్సాలీ అత‌ణ్ని సినిమా నుంచి త‌ప్పించాడేమో అన్న అనుమానంతో పోలీసులు ఆయ‌న్ని విచారించారు.

ఐతే సుశాంత్ బిజీగా ఉండటం వల్లే త‌న‌ సినిమాల్లో న‌టించ‌లేక‌పోయాడ‌ని బ‌న్సాలీ పోలీసులకు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. 2013లో బ‌న్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా’ సినిమా కోసం చిత్రబృందం తొలుత సుశాంత్‌ను కలిసింది. కానీ త‌ర్వాత ఆ చిత్రాన్ని ర‌ణ్వీర్ సింగ్‌తో తీశారు. అయితే తన సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని సుశాంత్‌ను కోరానని.. అయితే అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల సుశాంత్‌ ఆఫర్‌ను వదులుకున్నాడని బ‌న్సాలీ చెప్పినట్లు విచార‌ణ అధికారి వెల్ల‌డించారు. తర్వాత మరోసారి సుశాంత్‌‌ను సినిమా కోసం అడగలేదని.. అలా సుశాంత్‌కు అవకాశాన్ని ఇవ్వలేకపోయాన‌ని బ‌న్సాలీ చెప్పుకొచ్చినట్లు సమాచారం. సుశాంత్‌‌ ఆత్మహత్య కేసులో న్సాలీని దాదాపు రెండు గంటలకుపైగా పోలీసులు విచారించ‌గా.. సినిమాలు, ఇతర విషయాలకు సంబంధించి ఆయ‌న‌కు 20 ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లు తెలిసింది.