మమత బలం పెరుగుతోందా ?

మొన్ననే అఖండ విజయంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతాబెనర్జీ బలం మరింత పెరగనున్నదా ? అంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఎలాగైనా బీజేపీ జెండా ఎగరేయాలని విశ్వప్రయత్నాలు చేసిన నరేంద్రమోడి, అమిత్ షా ధ్వయం 77 సీట్లతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.

నిజానికి 294 సీట్లకు ఎన్నికలు మొదలైనా వివిధ కారణాల వల్ల మూడు నియోజకవర్గాల్లో సమస్య వచ్చింది. రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయారు. మరో నియోజకవర్గంలో పోలింగ్ అయిపోయిన తర్వాత తృణమూల్ అభ్యర్ధి చనిపోయాడు. ఈ మూడు నియోజకవర్గాలను పక్కనపెట్టేస్తే తాజాగా బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కరోనా వైరస్ సమస్య తగ్గిన తర్వాత ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.

నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయిన రెండు సెగ్మెంట్లలో ఎలాగూ ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత చనిపోయిన తృణమూల్ అభ్యర్ధి మంచి మెజారిటితో గెలిచారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు తప్పదు. పైగా తమ అభ్యర్ధి గెలిచిన సీటు కాబట్టి మమతబెనర్జీ ఇక్కడి నుండే పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీజేపీ తరపున మొత్తం ఐదుగురు ఎంపిలు ఎంఎల్ఏలుగా పోటీచేశారు. వీళ్ళల్లో ముగ్గురు ఓడిపోయి ఇద్దరు గెలిచారు. గెలిచిన ఇద్దరు నిజానికి ఎంపిలుగా రాజీనామాలు చేయాలి. కానీ విచిత్రంగా ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఈ రెండుస్ధానాలకు కూడా ఎన్నికలు తప్పవు. మొన్ననే మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చిన తృణమూల్ అభ్యర్ధులే ఈ ఐదు నియోజకవర్గాల్లోను గెలుస్తారనటంలో సందేహంలేదు. కాబట్టి మమత మెజారిటి మరింత పెరగటం ఖాయం.