మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు జనసేన అభ్యర్ధులకు పెద్ద షాకే ఇస్తున్నారట. కారణం ఏమిటంటే బీజేపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటమే. రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రం మొదటినుండి నెగిటివ్ ధోరణితోనే వ్యవహరిస్తోంది. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసివిగానే ఉన్నాయి. తాజాగా విశాఖ స్టీల్ కంపెనీని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంతో కేంద్రంపై జనాల్లో మంట పెరిగిపోతోంది.
జనాల్లోని మంటను చూసిన తర్వాతే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఢిల్లీకి వెళ్ళి ఏదో చేద్దామని ప్రయత్నించి భంగపడ్డారు. క్షేత్రస్ధాయిలో జనాల మూడ్ గురించి కేంద్రంలోని పెద్దలకు వివరిద్దామని వీర్రాజు చేసిన ప్రయత్నాలను అక్కడ ఎవరు పట్టించుకోలేదు. దాంతో చేసేదేమీ లేక వెనక్కు తిరిగి వచ్చేశారు. ఆయన తిరిగి రాగానే మున్సిపల్ ఎన్నికలు మొదలైపోయాయి. దాంతో ప్రచారానికి వెళ్ళాలంటేనే బీజేపీ నేతలు బాగా ఇబ్బందులు పడిపోతున్నారట.
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారం చేయాలంటేనే బీజేపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కమలనాదులను జనాలు ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలపై నిలదీస్తున్నారు. ఓటర్ల ప్రశ్నలకు ఏమని సమాధానాలు చెప్పాలో తెలీక నేతలు తమ ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు.
బీజేపీ నేతలతో కలిసి ప్రచారానికి వెళుతున్న జనసేన నేతలు, అభ్యర్ధులపైన దీని ప్రభావం పడుతోంది. అందుకనే బీజేపీ నేతలు లేకుండానే, వాళ్ళ కండువాలు కప్పుకోకుండా చాలా చోట్ల జనసేన నేతలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో బీజేపీ విషయంలో జనాల్లోని స్పందన చూసిన తర్వాత అవకాశం ఉన్న చోట్ల టీడీపీతో కలిసి పోటీ చేస్తోంది జనసేన.
ఓటర్ల షాకులు తమకు తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలో మొదట్లో జనసేన నేతలకు అర్ధంకాలేదు. అయితే బీజేపీని తప్పించేసి టీడీపీతో చేతులు కలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం తదితర ప్రాంతాల్లో టీడీపీ+జనసేన అభ్యర్ధుల గెలుపుకు రెండుపార్టీల నేతలు ఎంచక్కా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలిసీ వీర్రాజు ఏమీ చేయలేకపోతున్నారు.