ఈ తెల్లవారుజామున (గురువారం) విశాఖపట్నంలోని ఎల్ జీ పాలీమర్స్ (గోపాలపట్నం దగ్గర ఉన్న) లోని కెమికల్ లీక్ కావటం.. కంపెనీ ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురి కావటం.. వందలాదిగా అస్వస్థతకు కావటమేకాదు.. పెద్ద ఎత్తున మూగజీవాలు మరణించినట్లుగా చెబుతున్నారు. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖకు బయలుదేరారు. కాసేపట్లో ఆయన విశాఖకు చేరుకోనున్నారు.
తన ప్రయాణానికి ముందే జిల్లా కలెక్టర్.. ఎస్పీలతో పరిస్థితిని మదింపుచేసిన జగన్.. యుద్ధ ప్రాతిపదికన చర్యల్ని తీసుకున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ సాయాన్ని అందించటమే కాదు.. ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రసాయన వాయువు లీకేజీన అరికట్టేందుకు అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. కెమికల్ లీకేజీ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలకు అవస్థలకు గురైన ప్రజలకు సాయం చేసేందుకు వీలుగా మున్సిపల్.. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. వాహనాల్లో ప్రజల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితులకు సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం విశాఖలో కెమికల్ లీక్ ఉదంతంలో వందలాది మంది అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రమాదకర కెమికల్ లీక్ కావటం తెలిసిందే.
గ్యాస్ లీక్ ఘటనలో పెద్ద ఎత్తున పిల్లలు.. మహిళలు బాధితులుగా మారినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి తీవ్రత ఎలా ఉందంటే.. కెమికల్ లీకైన చోట చెట్లు సైతం మాడిపోవటం చూస్తే.. తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates