మన దేశంలో నెల కిందటితో పోలిస్తే కరోనా కేసులు ఎంతగానో పెరిగాయి. మరణాల రేటూ పెరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికీ ఎంతో మెరగైన స్థితిలోనే ఉంది. ఇప్పటిదాకా దేశంలో 33 వేల కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది దాకా వైరస్ కారణంగా మరణించారు. ఐతే ఈ 33 వేలలో మూడో వంతు కేసులు ఒక్క రాష్ట్రంలో ఉండటమే ఆందోళనకరం. ఆ రాష్ట్రం మహారాష్ట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా తక్కువగా లేవు. త్వరలోనే అక్కడ రోజు వారీ మరణాల సంఖ్య వంద దాటుతుందేమో అన్న ఆందోళన కూడా కలుగుతోంది. గురువారం ఒక్క రోజే మహారాష్ట్రలో కరోనా కారణంగా 27 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటిపోయింది. గురువారం సాయంత్రానికి కేసుల సంఖ్య 10500 దాకా ఉంది. ఈ రోజు 583 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇండియాలో మరే రాష్ట్రంలోనూ ఇందులో నాలుగో వంతు కేసులు కూడా నమోదు కాలేదు. బుధవారం మహారాష్ట్రలో 32 మంది కరోనా కారణంగా చనిపోవడం గమనార్హం. రాష్ట్రంలో మెజారిటీ కేసులు ముంబయిలోనే నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ ఏ రోజూ వందకు తక్కువ కేసులు నమోదు కాలేదు. ముఖ్యంగా అత్యంత జనసాంద్రత కలిగిన ధారావి మురికివాడలో కరోనా ప్రమాదకర రీతిలో విస్తరిస్తోంది. అక్కడ వందల మంది వైరస్ బారిన పడ్డారు. రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. చిన్న ఇంట్లో పది మంది సర్దుకునే అలాంటి చోట శానిటైజేషన్, సోషల్ డిస్టన్స్ అసాధ్యం. దీంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరణాల రేటు కూడా భయానకంగా ఉంటోంది. ఇక్కడ వేలమంది కరోనా వల్ల చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.