ప్లాస్మా చికిత్స‌.. రాష్ట్రాల‌కు కేంద్రం షాక్

Plasma
Plasma

క‌రోనా వైర‌స్ సోకిన వారికి నిర్దిష్ట‌మైన చికిత్స లేదు. దానికి ఇంకా మందు క‌నుగొన‌లేదు. వ్యాక్సిన్ రావ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స ప‌ద్ధతుల‌తో రోగుల్ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వైద్యులు. చివ‌రి ద‌శ‌లో ఉన్న రోగుల‌పై ర‌క‌ర‌కాల మందులు, కాంబినేష‌న్లు ప్ర‌యోగించి చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్లాస్మా థెర‌పీ చికిత్స తెర‌పైకి వ‌చ్చింది. వివిధ రాష్ట్రాలు ప్రయోగాత్మ‌కంగా ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేక‌రించి దాని ద్వారా చికిత్స అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఈ ప‌ద్ధ‌తిలో.

ఐతే ఈ థెర‌పీ వినియోగంపై కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది ప్రయోగ‌ దశలోనే ఉందని.. దీన్ని అనుస‌రించ‌వ‌ద్ద‌ని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది.ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుల‌ను ప్ర‌మాదంలోకి నెట్టొచ్చ‌ని.. ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రించ‌డం చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.

కరోనాకు ప్లాస్మా థెర‌పీనే స‌రైన చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు. ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఐతే రాష్ట్రాలు మాత్రం ప్లాస్మా థెరపీని అనుస‌రిస్తూ.. కరోనా నుంచి కోలుకున్న ర‌క్త‌దానం చేసి ఈ చికిత్స‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాయి. మ‌రి కేంద్రం ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.