వైట్ కాలర్ జాబ్ అంటే.. అందరికీ తెలుసు. కానీ, వైట్ కాలర్ దోపిడీల గురించిచాలా తక్కువ మందికే తెలుసు. కానీ, ఇప్పుడు వైట్ కాలర్ నేరాలు జోరుగా పెరుగుతున్నాయి. పోలీసులకు కూడా.. ఈ కేసుల చిక్కులు విప్పడం చాలా కష్టంగా మారింది. ఈ నేరాలు కూడా.. అంతుచిక్కకుండా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రపంచ మేధావులు మెదళ్లను రంగరిస్తే.. వచ్చే ఆలోచనలన్నీ.. ఈ నేరగాళ్లకే వస్తున్నాయంటే ఆశ్చర్యం అనిపించకమానదు.
మోసాల్లో రకరకాలు..
- ఫోన్లు చేసి మాటలు కలిపి.. బెదిరించి.. వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని దోపిడీ చేయడం
- ఫోన్లకు మెసేజ్‌లు పంపించి.. దీనిపై క్లిక్ చేస్తే. అద్భుతమైన గిఫ్ట్ మీకే అని చెప్పడం ద్వారా.. చేసే మోసాలు
- మీరు లక్కీడ్రాలో ఎంపికయ్యారని.. ఆశలు ఊరిస్తూ.. చేసే మోసాలు
- ఇక, మన కంప్యూటరో.. ఫోనో.. ఏది వీలైతే.. దానిలోకి వచ్చేసి.. మన ఆనుపానులు తెలుసుకుని చేసే ఘరానా మోసాలు.
- ఇక్కడ దొంగలు ఎవరూ.. కళ్ల జోళ్లు పెట్టుకోరు… గళ్ల లుంగీలు కట్టుకోరు. కంటికి కూడా కనిపించరు. ఇదే వారి స్టయిల్. కానీ, కోట్లలో సొమ్ము దోచేస్తారు.
తాజాగా ఏం జరిగింది?
బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోకి.. ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. ముంబయి సైబర్ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీరు తైవాన్ నుంచి కొరియర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తేలింది. ఆ కొరియర్ మీరే బుక్ చేసినట్లు ఆధారాలున్నాయి. బెంగళూరు సైబర్ పోలీసులకు మీపై ఫిర్యాదు చేస్తున్నాం. వారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు
అన్నాడు.
దీంతో సహజంగానే ఉండే బెరుకు ఆమెను కూడా ఆవరించింది. దీంతో ఏం చెయ్యాలో చెప్పమని .. ఫోన్‌లైన్‌లో ఉన్న వ్యక్తినే ప్రాధేయ పడింది. ఇదే అదునుగా భావించిన సైబర్ కంత్రీ.. రిజర్వ్ బ్యాంక్‌లో రూ. 3.46 లక్షలు డిపాజిట్ చేయండి, తర్వాత మొత్తం తిరిగి మళ్లీ మీకే వస్తుంది. మీకు ఈ కేసుకు సంబందం లేదని చెబుతామని నమ్మబలికాడు.
పాపం.. ఆ ఉద్యోగి.. కష్టపడి సంపాయించుకున్న సొమ్మును ఒక్క క్లిక్‌తో వాడి అకౌంట్‌కు జమచేసింది. ఇంకేముంది.. సొమ్ము పడగానే చిత్తగించాడు. ఫోన్ స్విచ్ఛాఫ్. రోజులు గడిచినా చెల్లించిన డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మోసపోయానని అర్థమై బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఇది మోసమని తెలిసి.. కన్నీరుమున్నీరైంది. సో.. ఇలాంటి ఉదాహరణలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. కాబట్టి.. తెలియని వారు ఫోన్లు ఎత్తకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు నిపుణులు.